టాలీవుడ్ సీనియర్ నటుడు స్వర్గీయ కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని డా. మంచు మోహన్ బాబు పరామర్శించారు. కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను, నాటి రోజుల్ని తలుచుకున్నారు. ఆయన అకాల మరణం చెందిన రోజున తాను హైదరాబాద్‌లో లేను అని మోహన్ బాబు తెలిపారు. అందుకే ఈ రోజు ఇలా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని అన్నారు.
ఈ మేరకు డా. ఎం. మోహన్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్‌లో లేను. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి.. సినిమా చాలా బాగుంది.. విష్ణుకు మంచి పేరు వచ్చింది అని నాతో చెప్పారు. 1987 సంవత్సరంలో "వీరప్రతాప్" అనే సినిమాలో మాంత్రికుడుగా మెయిన్ విలన్‌గా నా బ్యానర్‌లో అవకాశం ఇచ్చాను. మా బ్యానర్‌లో, బయట బ్యానర్‌లలో మేం కలిసి చాలా సినిమాల్లో నటించాం.
ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన గొప్ప నటుడు కోట. విలన్‌గా, కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు. కోట శ్రీనివాసరావు మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.