బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఇపుడు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేరు తెరపైకి వచ్చింది. ఈయనకు ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులకు సంబంధం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నిజానికి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత కరణ్ జోహార్‌పై అనేక రకాలైన విమర్శలు వచ్చాయి. బాలీవుడ్‌లో బంధుప్రీతిని, స్టార్ వారసత్వాన్ని కరణ్ ప్రోత్సహిస్తూ బయటి వాళ్లను తొక్కేస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కరణ్‌పై సగటు అభిమాని కూడా దుమ్మెత్తి పోశాడు.
ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో కరణ్ జోహార్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ సరఫరాదారులుగా ఎన్‌సీబీ గుర్తించిన క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రా.. కరణ్‌కు అత్యంత సన్నిహితులని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై కరణ్ జోహార్ స్పందించారు. ఆ ఇద్దరితో తనకెలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశాడు. 'ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలో అనుభవ్ చోప్రా ఉద్యోగి కాదు. 2011-12 మధ్య కాలంలో కేవలం 2 నెలలు మాత్రమే మా సంస్థలో పనిచేశాడు. ఇక, క్షితిజ్ ప్రసాద్ మా సంస్థలో ఓ ప్రాజెక్టు కోసం గతేడాది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యాడు.
అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అంతకుమించి ఆ ఇద్దరు వ్యక్తులతో, వాళ్ల వ్యక్తిగత జీవితాలతో నాకు, ధర్మ ప్రొడక్షన్స్‌కు ఎలాంటి సంబంధమూ లేద'ని కరణ్ పేర్కొన్నాడు. అలాగే తను ఎప్పుడూ మాదకద్రవ్యాలు తీసుకోలేదని, డ్రగ్ డీలర్స్ ఎవరితోనూ సంప్రదింపలు జరపలేదని స్పష్టం చేశాడు.
అలాగే, తన ఇంట్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ఇంట్లో జరిగిన పార్టీలో కూడా ఎలాంటి మాదకద్రవ్యాలను వాడలేదని విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.