బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని ఆయన ఓ 'విషకన్య'గా అభివర్ణించారు.
'విషకన్య' రియాను కదిలిస్తే సుశాంత్‌ను డ్రగ్స్ మత్తులో ముంచెత్తి, హత్య చేయడం వరకు అన్ని విషయాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు. రియాను ప్రశ్నించి మరింత సమాచారం రాబట్టాలంటే కస్టోడియల్ విచారణ అవసరం అని, త్వరలోనే రియా అరెస్ట్ తథ్యమని తెలిపారు. జాతీయ ప్రయోజనాల రీత్యా కూడా మాదకద్రవ్యాల దందాను బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలావుంటే, రియాకు, ఆమె కుటుంబానికి ముప్పు ఉందని, వారికి రక్షణ కల్పించాలని ముంబై పోలీసులకు సీబీఐ లేఖ రాసింది. ఆమె నివాసం వద్ద పెద్ద సంఖ్యలో మీడియా ఉంటోందని, ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు కూడా మీడియా వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్నారు.దీనిపై ముంబై పోలీసులు స్పందిస్తూ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.