మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప'. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం హార్డ్ డిస్క్ చోరీకి గురైంది. 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన హార్డ్ డిస్క్ అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిల్మ్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 'కన్నప్ప' చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్శిల్‌ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నాడు.
అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్ డ్రైవ్‌ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. ఎవరి మార్గదర్శకత్వంలోనో.. తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.