కరోనా సంక్షోభ సమయంలో తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న వివిధ శాఖలలోని కార్మికులకు చాలామంది ప్రముఖులు తమవంతు సాయం అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇదే కోవలో... సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తన వంతు సాయంగా పారిశుద్ధ్య కార్మికులకు బాదంపాలు, మజ్జిగను అందించే ఏర్పాటు చేసారు. దీనికి గాంధీ ఆసుపత్రి వద్ద పని చేసే పారిశుద్ధ్య కార్మికులు స్పందించి శేఖర్ కమ్ములకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకు మర్చిపోలేని విధంగా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల, గాంధీ ఆసుపత్రి వద్ద పని చేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల స్పందన వెలకట్టలేనిది అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన, 'మీకు నేను చేసింది చాలా తక్కువ. ప్రతిరోజూ మా కోసం మీరు చేస్తున్న దానిని దేనితోనూ పోల్చలేము. చాలా ఆనందంగా ఉంది. దీన్ని చాలా పెద్ద అవార్డుగా భావిస్తున్నా' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.