సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సంచలనం లక్ష్మీస్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా..? అని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ జనాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే... ఈ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను కడపలో చేయనున్నామని వర్మ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
కడపలో భారీ బహిరంగ సభలో ఈ వేడుకను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్ గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఆడియో రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వర్మ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
ఎన్నికల నేపధ్యంలో ఈ మూవీ రిలీజ్ కాకుండా ఆపాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కమీషన్‌ను ఆశ్రయించడం జరిగింది. అయితే... ఇది తమ పరిధిలోకి రాదని ఎన్నికల కమీషన్ తేల్చేసింది. దీంతో వర్మ ఈ నెల 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. సెన్సార్ బోర్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..? అనేది ఆసక్తిగా మారింది.