మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో బాధ్యతగల పౌరులుగా రూల్స్‌ను తు.చ తప్పకుండా పాటిద్దామని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పిలుపునిచ్చారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాను గురువారం ప్రారంభించారు. ఇందులో తొలి పోస్టు చేస్తూ పైవిధంగా పిలుపునిచ్చారు.
అలాగే, కరోనా బాధితుల సహాయార్థం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు తనవంతుగా ప్రధానమంత్రి సహాయనిధితో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు రూ.70 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
అలాగే దేశం నుంచి కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. అందువల్ల మనవంతుగా బాధ్యతగల పౌరులుగా నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాను @AlwaysRamCharan పేరుతో ప్రారంభించారు. ఈ ఖాతాకు ఇప్పటికే ఐదువేల మంది నెటిజన్లు ఫాలోయర్లుగా ఉన్నారు. కాగా, ఈయన తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు కొత్త సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని బుధవారం ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన విషయం తెల్సిందే.