నటించడం కష్టమా? సినిమాలు నిర్మించడం కష్టమా? అంటే నటించడం చాలా సులభం. నిర్మాతగా ఉండటం చాలా కష్టం. అసలు ఒక్కోసారి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నామో కూడా తెలీదు. కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అలా వెళ్తుంటే బాధగానే ఉంటుంది. ఈ చిత్రం కోసం మేం అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా పెట్టేశాను అని హీరోయిన్, నిర్మాత, రచయితగా డియర్ ఉమ అనే చిత్రం తీసిన సుమయ రెడ్డి అన్నారు.
ఈ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా సుమయ రెడ్డి మీడియాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మీ నేపథ్యం ఏంటి?
మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఇటు వైపు వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. మొదట్లో సినిమాలు చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నాను. కానీ అది అంత సులభం కాదు అని అర్థమైంది.
డియర్ ఉమ కథను రాయడానికి, సినిమా చేయడానికి స్పూర్తి ఏంటి?
కరోనా టైంలో నాకు ప్రతీ రోజూ ఓ కల వస్తూనే ఉండేది. అది నన్ను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించింది. అలా ఆ కలలో వచ్చిన పాయింట్ మీదే కథను రాసుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా మా చిత్రం ఉంటుంది.
ఈ చిత్రంలోకి పృథ్వీ అంబర్ ఎలా వచ్చారు?
తెలుగు హీరోని ట్రై చేశాం. కానీ చాలా కారణాల వల్ల మిస్ అవుతూ వచ్చాం. కానీ పృథ్వీ అంబర్‌కి కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. కొత్త ప్రొడక్షన్ అని కూడా చూడకుండా కథ నచ్చిన వెంటనే ఓకే చెప్పారు.
ఈ చిత్రంలో వైద్య రంగం మీద విమర్శలు గుప్పిస్తున్నారా?
కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే వాటిని చూపించబోతున్నాం. డాక్టర్లు, పేషెంట్స్‌కి మధ్యలో ఉండే పర్సన్స్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో చూపిస్తాం.
ఈ చిత్రం ఎలా ఉండబోతోంది?
డియర్ ఉమ చిత్రం కాస్త ఫిక్షనల్. కాస్త రియల్. సోషల్ మెసెజ్ అని కాకుండా ఓ సొల్యూషన్‌ని కూడా చెబుతాం. అందరికీ అవగాహన కల్పించేలా చిత్రం ఉంటుంది. హీరోయిన్‌గా ఉండి నిర్మాతగానూ సినిమాను చేయాలని అనుకోలేదు. కానీ అలా చేయాల్సి వచ్చింది.
బడ్జెట్ పెరిగిందా?*
డియర్ ఉమ సినిమాకి ముందు అనుకున్న దానికంటే ఎక్కువే పెరిగింది. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరినీ పెద్ద వాళ్లని తీసుకున్నాం. ఆర్టిస్టుల్ని కూడా చాలా పెద్ద వాళ్లని తీసుకున్నాం. అలా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ బడ్జెట్ పెరుగుతూనే వచ్చింది.
*డియర్ ఉమ టీం గురించి చెప్పండి?*
సాయి రాజేష్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. నా దగ్గరున్న డియర్ ఉమ కథను ఆయనకు చెబితే చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రదన్ గారి మ్యూజిక్ ప్రాణం. కెమెరామెన్ రాజ్ తోట గారి విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఏప్రిల్ 18న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి.