మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఇరు ప్యానల్స్ మధ్య యుద్ధం తీవ్రమవుతుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ వరుస ప్రెస్‌మీట్స్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు ఇండస్ట్రీ పెద్దలందర్నీ కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా మా ఎలక్షన్స్ పైనే చర్చ జరుగుతుంది. మంచు విష్ణు తనకు బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు ఇలా పెద్ద పెద్ద వాళ్లంతా సపోర్ట్ చేస్తున్నారు అని ప్రకటించారు. వాళ్ళందర్నీ కలిసి ఓట్లు కూడా అభ్యర్థించారు.
కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తనకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదని మీడియా ముందే చెప్పారు. మెగా ఫ్యామిలీ మాత్రం ఇండైరెక్టుగా ప్రకాష్ రాజ్‌కే మద్దతిస్తుంది. తాజాగా 'మా' ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న జీవిత ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
జీవిత మాట్లాడుతూ ఇటీవల ఓ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశాను. మా ఎన్నికల్లో నేను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం ఆయనకు చెప్పి ఓటు వేయాలని అభ్యర్థించగా ప్రస్తుత పరిస్థితులపై ఆయన అసహనం వ్యక్తం చేశారని అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోందని, ఓటు వేసేందుకు రానని ఆయన తేల్చి చెప్పారని జీవిత అన్నారు. తనను ఇకపై ఓటు అడగొద్దని కూడా ఎన్టీఆర్ చెప్పినట్లుగా జీవిత తెలిపింది.