Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

Advertiesment
GV Prakash

దేవి

, సోమవారం, 3 మార్చి 2025 (17:07 IST)
GV Prakash
సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'కింగ్స్టన్'. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకం మీద ఆయన ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా జీవి ప్రకాష్ కుమార్ తొలి చిత్రమిది. గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం మార్చి 7వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవి ప్రకాష్ కుమార్ హైదరాబాద్ వచ్చారు. తెలుగు మీడియాతో ఆయన ముచ్చటించారు. ఆయన ఇంటర్వ్యూ విశేషాలు.
 
'కింగ్స్టన్'లో మీరు హీరోగా నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశారు ?
ప్రొడక్షన్ చేయాలని కొన్ని రోజులుగా అనుకుంటున్నాను‌. కింగ్స్టన్ కథ విన్న తర్వాత నచ్చింది. జి స్టూడియోస్ సంస్థతో కలిసి చేశా. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇటువంటి సినిమా రాలేదు. 'కింగ్స్టన్'ను ఫ్రాంచైజీలా చేయాలని అనుకుంటున్నాం. మా దగ్గర నాలుగు పార్టుల వరకు కథ రెడీగా ఉంది. 
 
'కింగ్స్టన్' కథ ఏమిటి? ఇది ఏ జోనర్ సినిమా అని చెప్తారు?
సముద్ర తీరం పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జాలరి పాత్ర చేశాను. సాధారణంగా జాలర్లు అందరూ సముద్రంలో వేటాడడానికి వెళతారు. అయితే ఆ ఊరి ప్రజలు ఎవరూ సముద్రంలోకి వెళ్లరు. ఆ ఊరికి ఒక శాపం ఉంటుంది. అది ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. శాపాన్ని ఎదిరించాలని హీరో సముద్రంలోకి వెళ్తాడు.‌ అక్కడ ఏం జరిగిందనేది సినిమా. ఇండియాలో ఫస్ట్ సీ‌ అడ్వెంచర్స్ థ్రిల్లర్ సినిమా ఇది. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత హీరోలకు జాంబీలో ఎదురవుతారు. అలాగే ఆత్మలు కూడా ఉంటాయి. ప్రేక్షకులకు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
 
ఇందులో అండర్ వాటర్ సీక్వెన్సుల కోసం ట్రైనింగ్ తీసుకున్నారట!
నాలుగు రోజుల పాటు అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి నీటిలోకి వెళ్ళిన తర్వాత మూడు నిమిషాలు పైకి రావడానికి ఉండదు. శ్వాసను ఎలా ఆపాలి? అనే దాంతో పాటు యాక్షన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి నీటిలో ఉన్నప్పుడు వన్ మోర్ టేక్ అనేవారు. అప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉండేది. 
 
హీరోగా ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలలో శారీరకంగా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టిన సినిమా ఇదే అనుకోవాలా? 
అవును. షిప్ మీద యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేసేటప్పుడు తడి తడిగా ఉంటుంది కనుక జారిపోయేది. ఒక్కోసారి ఒక్క షాట్ చేసిన తర్వాత వేలు లేదా కాళ్ళ మీద గాయాలు అయ్యేవి. బ్యాండేజ్ కట్టుకుని మళ్లీ షూటింగ్ చేసేవాడిని. అయితే యాక్షన్ సీక్వెన్స్ అన్ని బాగా వచ్చాయి. 
 
టెక్నికల్ పరంగా సినిమా చేసేటప్పుడు ఏదురైన సవాళ్లు ఏంటి?
ఇండియాలో ఇప్పటివరకు ఇటువంటి సినిమా రాలేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా మూడు రోజుల పాటు టెస్ట్ షూటింగ్ చేశారు. ఆ తర్వాత గోకుల్ బినోయ్ సినిమా ‌మొత్తం చేశారు. ఒక బోటు మీద ఆర్టిస్టులు ఉంటే మరొక బోటు మీద కెమెరా ఉండేది. అలాగే కొన్ని మీనియేచర్ సెట్స్ కూడా వేశాం. సినిమా విడుదలైన తర్వాత హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతుంది. వీళ్ళు ఈ సినిమా ఎలా చేశారని తప్పకుండా అడుగుతారు.
 
'బ్యాచిలర్' సినిమాలో మీరు దివ్య భారతితో కలిసి నటించారు. మళ్లీ ఈ సినిమా చేశారు. ఆవిడ గురించి!?
జీ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని డిస్కషన్ వచ్చింది. మంచి కాంబినేషన్ అయితే బాగుంటుందని జీ స్టూడియోస్ సంస్థ కూడా దివ్యభారతి పేరు సజస్ట్ చేశారు. సినిమాలో ఆ అమ్మాయి యాక్షన్ సీక్వెన్స్ చేసింది. కింగ్స్టన్ తర్వాత ఆమెకు మంచి పేరు వస్తుంది. 
 
మీ సినిమాలకు మీరే మ్యూజిక్ చేస్తుంటారు. మీ సినిమాల కోసం స్పెషల్ వర్క్ ఏమైనా చేస్తారా? 
నేను హీరోగా నటించే సినిమాలు కంటే బయట సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తానని అందరూ చెబుతారు. కథను బట్టి సంగీతం ఇస్తున్నా. నా సినిమాల కోసం అంటూ స్పెషల్ వర్క్ ఏమీ చేయను. ఈ సినిమా కోసం కొత్త తరహా సౌండ్ కొన్ని వినిపించే ప్రయత్నం చేశా. హ్యారీ పాటర్, పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ వంటి ఫాంటసీ సీ ఫిలిమ్స్ హాలీవుడ్ ప్రొడ్యూస్ చేసింది. ఇది మన సినిమా కాబట్టి ఆ మ్యూజిక్ రిఫరెన్స్ ఏమీ లేకుండా మన సౌండ్ వినిపించాం. 
 
హీరోగా 25, సంగీత దర్శకుడిగా 100 సినిమాలు ఒకేసారి ఈ మైలురాయి చేరుకోవడం ఎలా ఉంది? 
సంతోషంగా ఉంది. 'ప్రేమ కథా చిత్రం' తమిళ రీమేక్ 'డార్లింగ్'తో హీరోగా పరిచయం అయ్యా. అప్పటినుంచి సినిమాలు చేస్తూ ఉన్నా. తమిళంలో మంచి మంచి విజయాలు వచ్చాయి. ఒక షెడ్యూల్ ప్రకారం పని చేసుకుంటా.‌ యాక్టింగ్, మ్యూజిక్ ఈ రెండిటికి ప్రొపర్ టైం కేటాయిస్తా. ఒకసారి షెడ్యూల్ మిస్ అయినా ప్లాన్ బి ఉంటుంది. సో... ప్రాబ్లం ఏమీ లేదు. దీపావళికి తెలుగులో 'లక్కీ భాస్కర్', తమిళంలో 'అమరన్' సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండిటికి నేనే సంగీతం అందించా.‌ ఆ రెండు చిత్రాలకు నాకు మంచి పేరు వచ్చింది.
 
మీరు హీరోలుగా నటించే సినిమాలే ప్రొడ్యూస్ చేస్తారా? బయట సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తారా?
మంచి కథ దొరికితే ఇతర హీరోలతో కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ. కింగ్స్టన్ తర్వాత సెల్వ రాఘవన్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా. ఆ కథ చదివిన తర్వాత నాకు విపరీతంగా నచ్చింది. నేను ప్రొడ్యూస్ చేయవచ్చా అని ఆయనను అడిగా. నేను హీరోగా నటించే సినిమాలు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలని రూల్ ఏమీ పెట్టుకోలేదు.
 
తెలుగులో అవకాశం వస్తే చేస్తారా? ఇప్పటి వరకు తెలుగు నుంచి మీకు అవకాశాలు ఏమీ రాలేదా?
'దసరా' సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు. అయితే రెండు వారాలలో షూటింగ్ ఉందని చెప్పారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా చేయలేకపోయా. మంచి కథ వస్తే తెలుగులో సినిమా చేయడానికి నేను రెడీగా ఉన్నాను.
 
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో మీకంటూ టైం ఉంటుందా? 
చాలా ఉంటుందండి. అందుకు ప్రాబ్లం ఏమీ లేదు. షూటింగ్ లేని టైంలో ఉదయం 9 గంటలకు నిద్ర లేస్తా. వర్కౌట్స్ అవి చేసుకుని మ్యూజిక్ పనులు మొదలుపెడతా. షూటింగ్ ఉంటే ఎర్లీగా నిద్ర లేస్తా.
 
చివరగా 'కింగ్స్టన్' సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు?
'బాహుబలి' ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. అలాగే 'కాంతార' సినిమా ప్రేక్షకులను స్పిరిచువల్ వరల్డ్ లోకి‌ తీసుకు వెళ్లింది. మా 'కింగ్స్టన్' సినిమా కూడా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్తుంది. హాలీవుడ్ దర్శక నిర్మాతలు వాళ్ల కథలను చెబుతున్నారు. మేం 'కింగ్స్టన్' ద్వారా మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథలను తెరపైకి తీసుకు వస్తున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్