భానుమతి వెలిగిపోతున్న ఫిదాలో నటించడానికి వరుణ్ ఎలా ఒప్పుకున్నారు?
ఫిదా.. మరో సావిత్రి మళ్లీ తెలుగు చిత్రసీమలో అవతరించిందా.. అనేంతగా భానుమతి పాత్రధారి సాయిపల్లవిని శిఖర స్థాయిలో నిలిపిన సినిమా. రాముడు లాంటి సాత్వికుడు, మంచితనానికి, ఓర్పుకు, సమతుల్యతకు నిర్వచనంగా వెల
ఫిదా.. మరో సావిత్రి మళ్లీ తెలుగు చిత్రసీమలో అవతరించిందా.. అనేంతగా భానుమతి పాత్రధారి సాయిపల్లవిని శిఖర స్థాయిలో నిలిపిన సినిమా. రాముడు లాంటి సాత్వికుడు, మంచితనానికి, ఓర్పుకు, సమతుల్యతకు నిర్వచనంగా వెలిగిన.. కెరీర్‌లోనే ఒక అద్భుతమైన సాఫ్ట్ పాత్రను పోషించిన హీరో వరుణ్ తేజ్‌ను సైతం సైడ్ చేసినట్లుగా భానుమతి ఫిదా సినిమాను తన కొంగులోకి లాగేసుకుంది. తెలంగాణ యాసతో గమకాలు పలికించిన గొంతుతో.. రెక్కల గుర్రంపై రాజకుమారుడు వస్తే కోటలోంచి వెళ్లిపోవడమేనా. కోటలోనే ఎందుకు ఉండకూడదు... మనం పుట్టిపెరిగిన ఊరిలో మన కన్న తల్లిదండ్రుల వద్ద పెళ్లయ్యాక కూడా మనం ఎందుకు ఉండకూడదు అంటూ కోట్లమంది భారతీయ మహిళల చిరకాల వేదనను ప్రశ్నరూపంలో సంధించి విలపించిన భానుమతి పాత్రధారి సాయి పల్లవి వరుణ్‌తో సహా సినిమా మొత్తాన్ని డామినేట్ చేసి పడేసింది.
కానీ ఒక్కటి మాత్రం నిజం భానుమతి విశ్వరూపం ముందు వరుణ్ కాస్త సైడ్ అయినట్లు కనిపించాడు కాని సినిమా ఆద్యంతం చూస్తున్నప్పుడు వరుణ్ కేరక్టర్‍ని ఎంత ఉదాత్తంగా చిత్రించారంటే ఈ కాలంలో అబ్బాయిలు ఇంతగా అమ్మాయిల మాటకు విలువ ఇస్తారా, అసలు ఆమ్మాయిల ఆలోచనలను ఏ బేషజం లేకుండా ఇంత కైండ్‌నెస్‌తో అర్థం చేసుకోగల అబ్బాయిలు ఈ లోకంలో ఇంకా ఉంటారా అనిపించేంత ఉదాత్త పాత్రను పోషించాడు వరుణ్. సినిమాలో ప్రతి సీనులోనూ కనిపించకపోవచ్చు. సాయి పల్లవి ఆకర్షణ ముందు తాను తేలిపోయినట్లు కనిపించవచ్చు కానీ నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా అంటూ 50 ఏళ్ల క్రితం ఒకగొప్ప పాట, ఒక గొప్ప నటుడు వ్యక్తపరిచిన ఆర్థ్రతను ఇన్నాళ్ల తర్వాత వరుణ్ తేజ్ తన కళ్లతో పలికించి అంత మొండి పట్టు కలిగిన భానుమతితోనే కంట తడిపెట్టించాడు వరుణ్..
మానవత్వం పరిమళించిన మంచి మనసు అనేది ఫిదా సినిమాలో వరుణ్ రూపంలో మనల్ని వెంటాడుతుంది. ఫిదాలో సాయి పల్లవి పాత్ర ముందు తను తేలిపోయినట్లు కనిపించినందుకు ఇప్పుడు వరుణ్ కాస్త విచార పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ సొంత ఊరిని ప్రేమిస్తున్న భానుమతిల మాట ఎందుకు మన్నించ కూడదు అనే ఆలోచనను యువకుల్లో తీసుకొచ్చిన గొప్పతనం వరుణ్ పాత్రకే దక్కుతుంది. ఆరకంగా హీరోయిజాన్ని, మెగా స్టార్ కుటుంబ వారసత్వపు అహాన్ని కాస్త పక్కను నెట్టేసి ఫిదా సినిమాకు ఒప్పుకున్న వరుణ్ తన కెరీర్‌లోనే నిలిచిపోగల గొప్ప పాత్రను పోషించాడు. దర్శకుడిని గౌరవించిన నిర్మాత, దర్శకుడు ఎలా చెక్కితే అలా తనను తాను మలచుకున్న హీరో ఎన్ని అద్భుతాలను సృష్టించగలరో అటు దిల్ రాజు, ఇటు వరుణ్ తేజ్ ఫిదాతో నిరూపించారు.
దిల్‌రాజు యాంకర్ రూపమెత్తి శేఖర్ కమ్ములను, వరుణ్ తేజను, సాయి పల్లవిని ఇంటర్వూచేసిన ఒక చానల్‌లో వరుణ్‌ని ఇదే ప్రశ్న వేశారు దిల్ రాజు. శేఖర్ వచ్చి లైన్ చెబుతారు ఫిదా కథ వింటావా అని ఫోన్ చేసి అడిగినప్పుడు నీ మనసులో ఏమకున్నావు అని దిల్ రాజు అడిగారు. అలా నిర్మాత ఫోన్ చేయగానే వరుణ్ చేసిన పని ఏమిటంటే రామ్ చరణ్‌కు కాల్ చేయడమే.
"కథ వినమని రాజుగారు అంటున్నారు అని చెబితే విను బాగుంటుంది అన్నాడు చరణ్. మీరు తర్వాత రాకముందే ఫిదా పట్ల పాజిటివ్‌గానే ఉన్నాను. పైగా శేఖర్ కమ్ముల సినిమాలు నాకు చాలా ఇష్టం. సినిమాలో నా కేరక్టర్ గాని, కథ గానీ చాలా హానెస్ట్‌గా అనిపించాయి. ఒక్క నా కేరక్టరే అని కాకుండా సాయిపల్లవి, వదిన, అక్కచెల్లెళ్ల మధ్య బాండింగ్ అన్నీ నాకు నచ్చాయి. మా ఇంట్లో అమ్మాయిలు ఎక్కువమంది. పెళ్లిళ్లయి అమ్మాయిలను పంపించేటప్పుడు వాస్తవంగా కూడా ఆ బాధ మా అనుభవంలో ఉంది...
...మా కుటుంబంలో పెళ్లిలో నేను ఒక మూల సరదాగా ఉంటాను కాని నాన్న నాగబాబు, పెద్దనాన్న చిరంజీవివంటివారు అమ్మాయిలను సాగనంపుతున్నప్పుడు పడే బాధను చూస్తుండేవాడిని. సాయిపల్లవి సినిమాలో నాన్నతో అంటుంది కదా. నేను నీకు కొడుకులెక్క. నీతోనే ఉంటాను. ఎక్కడికీ వెళ్లను ఈ ఇంట్లోనే ఉంటాను అని చెబుతుంది కదా. ఇవన్నీ నాకు అనేక స్థాయిల్లో కనెక్ట్ అయిఉండేవి. అందుకే కథ వినగానే బాగా నచ్చేసింది. దానికే రెండో ఆలోచన కూడా లేకుండా ఒకే అన్నాను." అన్నాడు వరుణ్.
పైగా తానెంతో ఇష్టపడే అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఫిదా సినిమా చూశాక చాలాసేపు తనతో మాట్లాడారని వరుణ్ చెప్పాడు. ప్రత్యేకించి నా పాత్రకానీ భానుమతి పాత్ర కానీ సినిమాలో బాంధవ్యాలను చిత్రించిన తీరు కానీ చాలా బాగున్నాయని అంతటి పెద్దాయన చెప్పడంతో చాలా సంతోషమేసింది అన్నాడు వరుణ్.
కాబట్టి ఫిదా సినిమాలో నటించినందుకు, చేయాలని నిర్ణయించుకున్నందుకు వరుణ్.. నీవు ఏమాత్రం బాధపడాల్సిన పనిలేదు. ఇలాంటి అబ్బాయి మా జీవితంలోకి ప్రవేశిస్తే ఎంత బావుణ్ణు అనే ఒక అభిలషణీయమైన కోరికను లక్షలాది మంది తెలుగు అమ్మాయిలు హృదయపు లోతుల్లో పాతుకునేలా చేసావు వరుణ్.
సాయి పల్లవి మొత్తం క్రెడిట్ కొట్టేసిందని నీవు బాధపడుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాకూడదనే మా కోరిక. కనీసం పదేళ్లపాటు ఫిదాలో నీ పాత్ర గురించి చెప్పుకుంటూనే ఉంటాం. మెగా ఫ్యామిలీ నుంచి మాకు దొరికిన ఒక మంచి, ఉదాత్త నటుడివి నీవు. మా జ్ఞాపకాల్లో నీవు ఇలాగే ఉండిపోవాలని మా అందరి కోరిక.