రాధికా ఆప్టే, మాధవీలత, కస్తూరి... పోయే.. తెలుగు హీరోల పరువు పోయే...అందరి నోర్లూ మూతపడి పోయే..
కృష్ణ వంశీ తీసిన ఖడ్గం సినిమాలో మూవీ ఛాన్సుల కోసం ప్రేమికుడిని కూడా వదులుకుని పడకసుఖానికి సిద్ధమై పతనంలోంచి హీరోయిన్ చాన్సులకు ఎదిగిపోయిన పాత్రధారిని చూసి హీరోతోపాటు ప్రేక్షకులు కూడా కదిలిపోయారు.
కృష్ణ వంశీ తీసిన ఖడ్గం సినిమాలో మూవీ ఛాన్సుల కోసం ప్రేమికుడిని కూడా వదులుకుని పడకసుఖానికి సిద్ధమై పతనంలోంచి హీరోయిన్ చాన్సులకు ఎదిగిపోయిన పాత్రధారిని చూసి హీరోతోపాటు ప్రేక్షకులు కూడా కదిలిపోయారు. ఇన్నాళ్లూ దర్శకులు, ఇతర నానా కంగాళీ సాంకేతిక నిపుణులు సందు దొరికితే చాలు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చిన అమ్మాయిలను లోబర్చుకుని పబ్బం గడుపుకుంటున్న వార్తలనే పత్రికలు రాయడం, మనం నోరు తెరుచుకుని చదవడం సాగిపోయింది.
కానీ దమ్మున్న మన యువ హీరోయిన్ల పుణ్యమా అని టాలీవుడ్‌లో అగ్ర హీరోలు సినిమా ఛాన్సుల పేరిట కొత్తగా అడుగుపెడుతున్న అమ్మాయిలను వెంటబడి వేధించి మరీ కోరికలు తీర్చుకుంటున్న వైనం తెలుసుకుంటూంటే షాక్ కాదు కదా .. అసహ్యం పుట్టక మానదు. ఇలా బయటపడుతున్న హీరోయిన్లు మర్యాదకో, భయానికో దేనికో తెలీదు కాని ఆ హీరోల పేర్లు బయటపెట్టలేదు. అయినా ఈ దగుల్భాజీ పనులకు ఎవరు పాల్పడ్డారో, ఇంకా పాల్బడుతున్నారో అందరికీ తెలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో అయితే కొందరి పేర్లు కూడా బయట పెట్టేశారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు.. పాత వాళ్లు, కొత్త వాళ్లు అనే తేడా లేదు, ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు తమను ఒక హీరో పిలిచాడనో, ఇంకో నిర్మాత అడిగాడనో.. హాట్ కామెంట్స్ చేసేస్తున్నారు. అయితే సదరు నిర్మాతలు, సదరు హీరోలు ఎవరో చెప్పడం లేదు కానీ.. ఇండస్ట్రీ లో అలాంటి ధోరణి ఉంది.. అనే వీరు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకించి సౌతిండియా హీరోల మీద చాలా మంది భామామణులు ఆరోపణలు చేస్తున్నారు.
వీరు చేస్తున్న ప్రకటనలు సంచలనంగా నిలుస్తున్నాయి. మొన్నామధ్య యువనటి మాధవీలత ‘సాయంత్రం ఫ్రీనా..’ అని తనను ఒక నిర్మాత అడిగాడు అని చెప్పగా, తాజాగా ఇప్పుడు సీనియర్ నటి కస్తూరి చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా నిలుస్తున్నాయి. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది ఆమె. అప్పట్లో తను ఒక సినిమా చేస్తుండగా.. అందులో హీరో తనను పడకింటికి రప్పించుకోవడానికి తీవ్రంగా యత్నించాడని కస్తూరి చెప్పింది.
అయితే అతడి కోరికను తను తీర్చలేదని ఈమె స్పష్టం చేసింది. మరి ఇంతకీ ఎవరా హీరో అంటే.. అది మాత్రం చెప్పలేదు. అతడు ఎవరో చెప్పడం కుదరదు, ఇప్పుడు అతడు రాజకీయాల్లో బిజీ గా ఉన్నాడు, అతడంటే తనకు ప్రత్యేకంగా కోపం ఏమీ లేదు.. ఇక్కడంతా అలాంటి వారే.. అనే శ్లేషను ధ్వనింపజేసింది కస్తూరి. మరి కస్తూరి సూఛాయగా చెప్పిన వివరాలను బట్టి.. అతడెవరో కనుక్కొనే పనిలో పడ్దారు నెటిజన్లు.
మరి ఈ మధ్య కాలంలోనే.. రాధికా ఆప్తే వంటి వాళ్లు కూడా దక్షిణాది హీరోలు తమను వేధించారన్నట్టుగా, పడకింటికి రమ్మన్నారన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు కస్తూరి తెరపైకి వచ్చింది. మొత్తానికి వీళ్లు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను చెబుతూ, తమను వేధించిన వారెవరో సూఛాయగా చెబుతూ. సదరు హీరోలను చాలానే ఇబ్బంది పెడుతున్నట్టున్నారు.
ఈ ఒకరిద్దరు హీరోయిన్లు బయటపడితే పడ్డారు కానీ, ఈ విషయంపై మన తెలుగు హీరోల్లో ఒకరయినా నోరెత్తితే ఒట్టు. దీని భావమేమి తిరుమలేశా... మొత్తం అందరూ అదే బాపతేనా.. ఇంకొక్క మాట వదిలితే కొంపలు అంటుకుపోయేటట్టున్నాయి.. ఇక చాలిద్దాం.