తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని, అయితే ఎపుడు వస్తానన్న విషయంపై తనకు క్లారిటీ లేదని హీరో విశాల్ అన్నారు. అదేసమయంలో ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తాను వైకాపా తరపున పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను కుప్పంలో పోటీ చేయడం లేదని, ముఖ్యంగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు సార్‌పై అస్సలు పోటీ చేయనని తేల్చి చెప్పారు.
తన కొత్త చిత్రం "లాఠీ" చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఆదివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, తనకు కుప్పానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తన తండ్రి గ్రానైట్ వ్యాపారం చేసే సమయంలో తాను అక్కడే మూడేళ్ళపాటు ఉన్నానని చెప్పారు. కుప్పంలోని ప్రతి వీధి, ప్రతి ఒక్కరు తనకు బాగా తెలుసని ఆయన చెప్పారు. ఈ వివరాలన్నింటిని పక్కాగా సేకరించి తాను పోటీ చేయనున్నట్టు పుకార్లు సృష్టించారని తెలిపారు.
పైగా తనకు చెన్నై ఎలాగో కుప్పం కూడా అలాంటిదేనని చెప్పారు. అక్కడ పోటీ చేసే ఉద్దేశ్యంలేదన్నారు. అదేసమయంలో తాను రాజకీయాల్లోకి వస్తానని, తన ప్రవేశించే సమయంపై ఓ క్లారిటీ లేదన్నారు. అదే సమయంలో రాజకీయాల్లోకి మాత్రం తప్పకుండా వస్తానని చెప్పారు. సామాజిక సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఇందుకోసం ఇన్ని రాజకీయ పార్టీలు అక్కర్లేదన్నారు.