టాలీవుడ్ హీరో నితిన్ వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్-షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. పెళ్లికొడుకుగా నితిన్, పెళ్లికూతురిగా షాలిని డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు.
భీష్మా సినిమా రిలీజ్ తరువాత వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ, లాక్ డౌన్ కారణంగా వివాహం వాయిదా పడింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో నితిన్ వివాహం రెండుసార్లు వాయిదా వేసుకున్నారు. అయితే, కరోనా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేకపోవటంతో ఈ వివాహ నిర్ణయం తీసుకున్నారు.
ఇకపోతే, నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తీ సురేష్ కథానాయిక. నితిన్ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ టు అవర్ హీరో’ అంటూ ‘రంగ్ దే’ టీమ్ టీజర్‌ని విడుదల చేసింది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్).