తమిళ స్టార్ హీరో సూర్యకు నిజంగానే నేడు స్పెషల్ బర్త్ డే నేడు. బర్త్ డే జరుపుకుంటున్న సూర్యకు ఒక రోజు ముందు శుక్రవారం జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు సూర్యను ఎంపిక చేశారు.
డెక్కన్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథ్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కిన తమిళ చిత్రం సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లో టైటిల్ రోల్ పోషించిన సూర్యకు ఈ అవార్డు దక్కింది.
శనివారం సూర్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ బర్త్ డే మీకు నిజంగానే ప్రత్యేకమైనదేనని చిరు గుర్తు చేశారు.
పుట్టిన రోజు నాడే జాతీయ అవార్డుకు ఎంపిక కావడం అరుదని, అలాంటి అరుదైన అవకాశం మీకు దక్కిందంటూ సూర్యకు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పారు.
ఇదిలా ఉంటే సూర్యకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందించిన సూరరై పోట్రు సినిమా జాతీయ చలన చిత్ర అవార్డులో సత్తా చాటింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఈ చిత్రానికి అవార్డు రాగా, ఉత్తమ నటి అవార్డు కూడా సూర్యకు జోడిగా నటించిన అపర్ణ బాలమురళికి దక్కింది.
ఇకపోతే.. సూరారై పోట్రు సినిమాను చేసే విషయంలో తనను ఎంతగానో ప్రోత్సహించిన తన భార్య జ్యోతికకు కూడా సూర్య స్వీట్ గా థ్యాంక్స్ చెప్పాడు.
"నా జ్యోతికకు ప్రత్యేక ధన్యవాదాలు. సూరారై పోట్రు సినిమాను నిర్మించేందుకు, అందులో నటించేందుకు ఆమే నన్ను ప్రోత్సహించింది. ఇప్పటి వరకు నా కృషిని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ, మా అమ్మ, అప్ప, కార్తీ, బృందాలకు కూడా ప్రేమతో ధన్యవాదాలు" అని హీరో సూర్య పేర్కొన్నాడు.