తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని మెగా పవర్ స్టార్, హీరో రామ్ చరణ్ ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్‌డే అప్పా.. మెగాస్టార్ ఆచార్య అంటూ ఈ వీడియోను తయారు చేశారు.
ముఖ్యంగా, చిరంజీవి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రితో కలిసి ఆచార్య చిత్రం సెట్‌లో గడిపిన సందర్భాలకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేశారు. షూట్ కోసం మెగాస్టార్‌ని తన కారులో స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళుతున్న రామ్ చరణ్ ఆ తర్వాత సెట్‌లో తండ్రితో కలిసి సందడి చేశాడు.
ఆయనని చూసి చాలా నేర్చుకున్నానని చెప్పిన రామ్ చరణ్ తన తండ్రికి ప్రేమ పూర్వక బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సినిమాలో చరణ్ - చిరు ఇద్దరు నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక టీజర్‌లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు బహుశా గుణపాఠాలు చెప్తాననేమో.. అంటూ చిరు చెప్పిన డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక ఆచార్యలో రామ్ చరణ్ సిద్ద అనే పాత్రలో కనిపించనున్నాడు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది.