ఆర్ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఉక్రెయిన్‌లో షూటింగ్ ముగించుకుని సురక్షితంగా తిరిగి నగరానికి చేరుకుంది. అయితే, ఈ చిత్రం విడుదల తేదీపై మరోమారు నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో ఇంకా పలు చోట్ల థియేటర్లు తెరకవపోవడం, ఏపీలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు తక్కువ టైంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ప్రమోషన్లు చేసే వీలు లేకపోవడంతో ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు రాజమౌళి - ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం విడుదలకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలించేలా కనిపించడం లేదు. దీంతో ఈ చిత్రం విడుదల తేదీపై దర్శకుడు రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టి విడుదల తేదీని ప్రకటించే అవకాశాలున్నాయి.
ఈ చిత్రం ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీ మార్చుకుంది. ముందుగా 2020 జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత 2021 జనవరి 8న పక్కా థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. అయితే అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది.
చివరగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించగా.. ఈసారి కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందులు తెచ్చి పెట్టింది. చెప్పిన తేదీకి ఈసారి విడుదల చేయాలని గట్టిగానే ట్రై చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.