ఉరితీసినా 'పద్మావత్' చిత్రాన్ని అడ్డుకుంటాం : బీజేపీ నేత
తనను ఉరితీసినా 'పద్మావత్' చిత్ర ప్రదర్శనను అడ్డుకుని తీరుతామని బీజేపీ నాయకుడు సూరజ్ పాల్ అము ప్రకటించారు. తనను ఉరి తీస్తున్నా ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉంటానని సూరజ్ పాల్ స్పష్టం చేశారు
తనను ఉరితీసినా 'పద్మావత్' చిత్ర ప్రదర్శనను అడ్డుకుని తీరుతామని బీజేపీ నాయకుడు సూరజ్ పాల్ అము ప్రకటించారు. తనను ఉరి తీస్తున్నా ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉంటానని సూరజ్ పాల్ స్పష్టం చేశారు. ‘పద్మావత్’ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ లేదా నటి దీపిక తల నరికి తీసుకువస్తే తాను పదికోట్ల రూపాయలు ఇస్తానని గతంలో సూరజ్ పాల్ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. మొత్తంమీద బీజేపీ నాయకుడు సూరజ్ పాల్ తాజా వ్యాఖ్యలు మరోసారి సంచలనం రేపాయి.
మరోవైపు, ఈ చిత్ర ప్రదర్శనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధాన్ని కూడా సుప్రీంకోర్టు తొలగించింది. దీంతో నిర్మాత ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ చిత్ర విడుదలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ వర్గీయులు మాత్రం ఏమాత్రం తలొగ్గడం లేదు.
తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. తమ వినతులను పట్టించుకోకుండా ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని తాజాగా హెచ్చరించారు. పైగా, ఈ చిత్రాన్ని నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాణి 'పద్మావతి' జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారని రాజ్‌పుత్‌లు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించగా సుప్రీంకోర్టు మాత్రం ఈ సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాజ్‌పుత్‌లు ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.