Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్యోధనుడి పాత్ర నుంచి డైలాగ్ కింగ్ సాయికుమార్‌గా 50 ఏళ్ళ జ‌ర్నీ

Advertiesment
saikumar 50 years
, గురువారం, 20 అక్టోబరు 2022 (20:37 IST)
saikumar 50 years
ఆయన స్వరం రగిలించే భాస్వరం..
ఆయన రూపం గంభీరం..
ఆయన నటన అద్వితీయం..
తెరపై ఆయన ఆవేశం అద్భుతం..
ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోసే అభినయం ఆయన సొంతం..
ఏ పాత్రకైనా తన స్వరంతో ప్రాణ ప్రతిష్ట చేయడం దేవుడు ఆయనకు ఇచ్చిన వరం..
5 దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం పదిలం..
 
webdunia
Duryodhana role
అక్టోబర్ 20, 1972.. నటుడిగా సాయికుమార్ జన్మదినం. లెజెండరీ కమెడియన్ రాజబాబు గారి పుట్టినరోజు సందర్భంగా 50 సంవత్సరాల కింద డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ నిర్వహించిన నాటకంలో దుర్యోధనుడి పాత్రతో రంగస్థలం ప్రవేశం చేశారు సాయికుమార్. ఆరోజు ఆ ప్రదర్శన చూడడానికి మరో లెజెండరీ నటుడు స్వర్గీయ ఎస్వీ రంగారావు గారు రావడం.. దుర్యోధనుడిగా ఆ నటన చూసి ప్రశంసించడం ఆయన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని చెప్తుంటారు. అలాగే ఆరోజు జరిగిన ప్రదర్శనకు ఎంతో మంది సినీ అతిరథ మహారథులు హాజరయ్యారు. ఆ రోజు వాళ్లిచ్చిన ఆశీర్వచనాలే ఈ రోజు నాకు వచ్చిన ఈ స్థాయి అని ఎంతో వినమ్రంగా చెప్తుంటారు సాయి కుమార్. శ్రీ కాకరాల గారు, జె వి రమణ మూర్తి గారి శిక్షణలో ఈయన పరిణతి చెందారు. 
 
ఇక ఆ తర్వాత తండ్రి ఇచ్చిన స్వరం.. అమ్మ నేర్పిన సంస్కారం.. ప్రేక్షకుల అభిమానం.. దేవుడి అనుగ్రహంతో 5 దశాబ్దాలుగా ఈ అప్రతిహత సినీ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్టీ రామారావు గారు నటించిన సంసారం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సాయి కుమార్. అలాగే బాల నటుడిగా శోభన్ బాబు గారు హీరోగా నటించిన దేవుడు చేసిన పెళ్లి సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత సాయి కుమార్ గారి నటన ప్రస్థానం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో వచ్చి మలుపు తిప్పే పాత్ర అయినా.. అమ్మ రాజీనామా, కొడుకులు లాంటి సినిమాలలో ఎమోషన్ అయినా.. మేజర్ చంద్రకాంత్, ఎవడు లాంటి సినిమాలలో విలనిజమైనా పాత్ర ఏదైనా స్వరంతో పాటు పరకాయ ప్రవేశం చేయడం సాయి కుమార్ గారికి మాత్రమే సాధ్యం. 
 
కర్ణాటకలో ఈయన పాపులారిటీ గురించి ఏం చెప్పాలి. పోలీస్ స్టోరీ అనే సినిమా ఈయన కెరీర్ లో ఒక మచ్చుతునక. అగ్ని అంటూ తెరపై ఆయన చూపించిన వీరావేశం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తు. ఈ సినిమా వచ్చి పాతిక సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ అగ్నిపాత్రకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అంటే అది కేవలం సాయికుమార్ గారి నటన ప్రతిభే. తనను ఇంతగా ఆదరించిన కర్ణాటక ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అలాగే తెలుగు, తమిళం, కన్నడ సినిమాలలో గత 50 సంవత్సరాలుగా నిర్విరామంగా.. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉన్నారు. ఈ ఏడాది మలయాళంలోకి కూడా అడుగు పెడుతున్నారు. 
 
తండ్రి పీజే శర్మ గారు, తల్లి కృష్ణ జ్యోతి గారు కూడా నటన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. దానికి తోడు స్వరం ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వరం. నాటి నుంచి నేటి ఆది సాయి కుమార్ వరకు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూనే ఉన్నారు. ఈ ప్రేమ, అభిమానం, ఆప్యాయత తమపై ఎల్లప్పుడూ ఉండాలని.. ఇంతగా తమను ఆదరించిన ప్రేక్షకులకు.. సినీ కళామతల్లికి.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు.. ఇన్నేళ్ళుగా తనతో పాటు పనిచేస్తున్న పర్సనల్ స్టాఫ్ కు.. తను ఎంతగానో ఇన్ స్పైర్ చేసిన శివాజీ గణేషన్ గారికి.. ఈ 50 సంవత్సరాల ప్రస్థానంలో తనతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో పాటు.. పాదాభివందనం చేశారు సాయి కుమార్. ఈ ప్రయాణంలో సిక్సర్లు, ఫోర్లు, డబుల్స్, సింగిల్స్, రన్ అవుట్స్, డకౌట్స్ ఇలా అన్నీ ఉన్నాయి.. కానీ రిటైర్ మాత్రం అవలేదు.. రిటైర్డ్ హర్ట్ అవలేదు అంటూ తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ పరిభాషలో తన కెరీర్ ను అభివర్ణించారు సాయి కుమార్. 
 
నాటకాలతో మొదలైన ప్రస్థానం సినిమాలు, సీరియళ్లు, గేమ్ షోస్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వెబ్ సిరీస్‌లు ఇలా ఎన్నో విధాలుగా తనను ప్రేక్షకులకు పరిచయం చేసుకునే అవకాశం వచ్చినందుకు సదా కృతజ్ఞుణ్ణి అని చెప్పారు ఈయన. ప్రస్తుతం ఈయన షూటింగ్ కంప్లీట్ చేసినవి.. లొకేషన్ లో ఉన్నవి.. ఒప్పుకున్నవి.. దాదాపు 15 సినిమాలున్నాయి. ఈయన ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కంగ్రాజులేషన్స్ టు సాయికుమార్ గారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడవుః ఐ క్యూ ఆడియోలో ఘంటా శ్రీనివాస్