బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఆయన కంపెనీలో పని చేసే సిబ్బంది సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. దీంతో రాజ్‌కుంద్రా చిక్కుల్లో పడేలా కనిపిస్తున్నారు.
ఇప్పటికే అడల్ట్ కంటెంట్ తయారీ కేసులో రాజ్‌కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెల్సిందే. తాజాగా ఈ కేసులో ఆయన సంస్థలో పనిచేసే ఉద్యోగులే వ్యతిరేక సాక్ష్యం చెప్పడం దుమారం సృష్టిస్తుంది.
రాజ్‌కుంద్రాకి చెందిన వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులే కుంద్రాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం వెల్లడించారు.
నీలి చిత్రాలు రూపొందించడానికి సంబంధించి వీరంతా పూరి స్థాయి సమాచారాన్ని పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తుంది. దీంతో రాజ్‌కుంద్రాకి మరిన్ని సమస్యలు ఎదురు కాబోతున్నాయి. త్వరలోనే కుంద్రాపై మనీ ల్యాండరింగ్, ఫారిన్ ఎక్స్ ఛేంజ్ యాక్ట్ (ఫెమా) కేసుల్ని ఈడీ పెట్టే అవకాశాలున్నాయి.
నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫామ్‌లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రాని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 27 వరకు ఆయన పోలీసుల కస్టడీలో ఉంటారు.
ఈ సందర్భంగా పోలీసులు జరుపుతున్న విచారణకు ఆయన సరిగ్గా సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య శిల్పా శెట్టిని కూడా విచారించారు. ఆమె దీంట్లో తన ప్రమేయం లేదని, పోర్నోగ్రఫీ చిత్రాలు, ఏరోటిక్ చిత్రాలు రెండూ వేరని పోలీసులకు చెప్పినట్టు సమాచారం.