"జై భీమ్" చిత్ర నిర్మాతలైన హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతికలతో పాటు ఈ చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్‌పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఈ నెల 20వ తేదీన కోర్టుకు సమర్పించాలని చెన్నై సైదాపేట కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. గత యేడాది నవంబరు 2వ తేదీన విడుదలైన జైభీమ్ చిత్రం అనేక విమర్శలతో పాటు కనకవర్షం కురిపించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టుతున్నాయి.
ఇందులో వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచే, అవమానించేలా పలు సన్నివేశాలు ఉన్నాయని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై రూ.5 కోట్లకు పరువు నష్టం దావా నోటీసు కూడా హీరో సూర్యకు రాజకీయ పార్టీ అయిన పీఎంకే పంపించింది.
ఈ నేపథ్యంలో రుద్ర వన్నియర్ సేనా అనే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు "జైభీమ్" చిత్ర నిర్మాతలతో పాటు దర్శకుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
చెన్నై వేళచ్చేరిలో గత యేడాది నవంబరులో ఈ చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను ప్రస్తావిస్తూ, నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని సంతోష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీన్ని విచారించిన కోర్టు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి ఈ నెల 20వ తేదీన కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే 20వ తేదీకి వాయిదా వేశారు.