సంక్రాంతి వచ్చిందంటే తెలుగు సినిమాల బాక్సాఫీస్ వద్ద చిన్న పెద్ద హీరోలని భేదం లేకుండా చిత్రాలు విడుదలవుతాయి. అయితే ఈ ఏడాది పోరు మరీ తీవ్రంగా ఉంది. అందులోనూ ఇద్దరు సూపర్‌స్టార్‌లు, స్టైలిష్ స్టార్, అలాగే నందమూరి హీరో మధ్య పోటీ నెలకొంది. ముందుగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ 'దర్బార్' అంటూ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
మరోవైపు తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం జనవరి 11న థియేటర్‌లలో సందడి చేయనుంది. గతేడాది సంక్రాంతికి ఎఫ్2తో గ్రాండ్ విక్టరీ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఈసారి కూడా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో ఆకట్టుకోబోతున్నాడు. దిల్ రాజు, అనీల్ సుంకర మరియు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే అతని చేతిలో థియేటర్‌లు చాలానే ఉన్నాయి.
అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'అల..వైకుంఠపురంలో..' చిత్రం కూడా జనవరి 12న విడుదల కానుంది. వీటితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎంత మంచివాడవురా' చిత్రం కూడా జనవరి 15న విడుదలకు సిద్ధమైంది.
అన్నీ పెద్ద చిత్రాలు కావడంతో థియేటర్‌ల విషయంలో సమస్య తలెత్తే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. వీటిల్లో రజనీకాంత్ దర్బార్ చిత్రం మినహా మిగిలినవి అన్నీ కుటుంబ కథా చిత్రాలు కావడంతో సంక్రాంతికి పోటీ మరింత తీవ్రతరమైంది. వీటిలో ఏది ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేస్తారో తెలియాలంటే సంక్రాంతి దాకా ఆగాల్సిందే మరి..