Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్నందరూ పక్కా హైదరాబాదీ అంటారు: ఎయిర్‌పోర్టులో హీరోయిన్ అమ్రిన్‌ ఖురేషి

Advertiesment
నన్నందరూ పక్కా హైదరాబాదీ అంటారు: ఎయిర్‌పోర్టులో హీరోయిన్ అమ్రిన్‌ ఖురేషి
, శనివారం, 5 డిశెంబరు 2020 (22:26 IST)
అమ్రిన్‌ ఖురేషి... రెండు బాలీవుడ్ భారీ చిత్రాల్లో నటిస్తోన్న పక్కా హైదరాబాదీ. సాధారణంగా బాలీవుడ్‌ హీరోయిన్స్‌ తెలుగు సినిమాల్లో నటిస్తుంటారు. అలాంటిది ఓ తెలుగు అమ్మాయి అమ్రిన్‌ ఒకేసారి రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం విశేషం. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'సినిమా చూపిస్తమావ' చిత్రాన్ని 'బ్యాడ్‌బాయ్‌' పేరుతో రీమేక్‌ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి స‌ర‌స‌న హీరోయిన్‌గా అమ్రిన్‌ న‌టిస్తోంది.
 
రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాజిద్‌ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుద‌ల‌ కానుంది. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. షూటింగ్‌లో పాల్గొన‌డానికి వ‌స్తోన్న సంద‌ర్భంగా హైద‌రా‌బాద్ ఎయిర్‌పోర్ట్‌లో అమ్రిన్ ఖురేషి మాట్లాడుతూ - ``హైద‌రాబాద్ నా బ‌ర్త్ ప్లేస్‌. సికింద్రాబాద్ శివ‌శివాని పబ్లిక్ స్కూల్‌లో చ‌దు‌వుకున్నాను. ఆ త‌ర్వాత‌ ముంబైలో యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు హీరోయిన్‌గా నా ఫ‌స్ట్ మూవీ `బ్యాడ్‌బాయ్` సాంగ్ షూట్‌కి హైద‌రాబాద్‌ రావ‌డం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'సినిమా చూపిస్తమావ` చిత్రానికి రీమేక్ ఇది. అలాగే `జులాయి` రీమేక్‌లో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నాను. ఈ రెండు సినిమాల్లోనూ మిథున్‌ చక్రవర్తిగారి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా న‌టిస్తున్నారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం చాలా కంఫ‌ర్ట్‌గా ఉంది. ఈ చిత్రాలు నిర్మాణంలో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్స్‌ వస్తున్నాయి. మంచి క‌థా బ‌లం ఉన్న సినిమాల్లో న‌టిస్తూ అన్ని సౌత్‌ లాంగ్వేజెస్‌లో హీరోయిన్‌గా విజయాలు సాధించాలన్నదే నా‌ లక్ష్యం.
 
ముంబైలో ట్రైనింగ్‌ పూర్తయ్యాక అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మా నాన్నగారి నిర్మాణంలో రూపొందుతున్న 'బ్యాడ్‌బాయ్‌' సినిమాలో హీరోయిన్‌ కోసం ఆడిషన్స్‌ చేస్తున్నారని తెలిసి నేను నా ఐడెంటిటీ గురించి చెప్పకుండానే ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌గారికి ఫైనల్‌ ఆడిషన్‌ సమయంలో నేనెవరో తెలిసినా అప్పటికే ఆడిషన్స్‌లో నేనెంటో ప్రూవ్‌ చేసుకోవడంతో ఆయన నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
 
ఈ సినిమా కోసం నెల రోజుల పాటు ట్రెయినింగ్‌ సెషన్‌లో పాల్గొన్నాను. హీరోయిన్‌గా మారే క్రమంలో జరిగే ట్రాన్స్‌ఫర్మేషన్‌ నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. నాకు హైదరాబాద్‌తో చాలా మంచి అనుబంధం ఉంది. నా స్నేహితులు, బంధువులు చాలా మంది హైదరాబాద్‌లో ఉన్నారు. రెగ్యులర్‌గా హైదరాబాద్‌కు వస్తుంటాను. నన్ను అందరూ పక్కా హైదరాబాదీ అని పిలుస్తుంటారు. అలా పిలిపించుకోవడం నాకు చాలా ఇష్టం'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫినాలేకు బిగ్ బాస్ నాలుగో సీజన్.. ముఖ్య అతిథిగా ఆయన వస్తున్నారట..?