తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగుచూసిన మాదకద్రవ్యాల కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఈడీ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టులో ఈడీ ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఎక్సైజ్ శాఖ జరిగిన విచారణపై ఈడీ అధికారులు పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే మరింత లోతుగా దర్యాప్తు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలిపినట్టు ఉన్నారు.
ముఖ్యంగా, డ్రగ్ ఫెడ్లర్‌తో సంబంధం ఉన్న వారి మొబైల్ కాల్ జాబితాను సేకరించి పరిశీలించాలని ఈడీ భావిస్తుంది. అంతేకాకుండా ఎక్సైజ్ అధికారుల వ్యవహారశైలిపై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
కాగా, ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు, సినీ సెలెబ్రిటీల పేర్లు ఉన్నాయి. అలాగే, మరికొందరు వ్యాపారులు హవాలా మార్గంలో నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.