ప్రముఖ దర్శకుడు `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం రాధాకృష్ణ. అనురాగ్, ముస్కాన్ సేథీ (పైసా వసూల్ ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంతెన నరసింహరాజు (చిలుకూరు) సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ మూవీ ట్రైలర్‌ను టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ - ``రాధాకృష్ణ మూవీ ట్రైలర్ చూశాక చిత్ర యూనిట్ అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే కనుమరుగైపొతున్న మన చేతివృత్తుల కళాకారుల్ని ప్రోత్సహించాలనే మంచి సామాజిక దృక్పధంతో నిర్మల్ బొమ్మలు తయారుచేసే కళాకారుల గురించి, వారు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా నిర్మించడం అనేది నిజంగా అభినందించవలసిన విషయం. ఎందుకంటే ఎంతోమంది చేతివృత్తి కళాకారులు మారుతున్న కాలంలో నైపుణ్యం ఉన్నాకూడా సరైన ప్రోత్సాహం లభించక, కొనేవారు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దాన్ని మెయిన్ థీమ్‌గా తీసుకుని సినిమా తీయాలన్న మీ ఆలోచనకే టీమ్ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
మంచి ఆశయంతో తీసిన సినిమా కాబట్టి తప్పకుండా రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి ఎంతో గొప్ప విజయాన్ని ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక తెలుగు సినిమా పరిశ్రమకి సంభందించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పథకాలు కావాలన్న ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి జగన్ గారు సిద్దంగా ఉన్నారు. మరో ప్రధాన విషయం ఏంటంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సుందరమైన లోకేషన్స్ ఉన్నాయి. మరెన్నో చోట్ల టూరిజం ప్రాంతాల్ని అభివృద్ది చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఎలాగైతే సినిమా పరిశ్రమ అభివృద్ది చెందిందో రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభివృద్ది చెందడానికి అవసరమయ్యే అన్ని చర్యలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.`` అన్నారు.
ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, ``జీవితంలో మనం ఊహించనివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం ఏంటీ..బాగుంది అని పెద్దలందరూ చెప్పడం ఏంటి అని ఇప్పటికీ నాకు అర్ధం కాని పరిస్థితుల్లోనే ఉన్నాను నేను. ఏదేమైనా కళ అనేది భగవంతుడు ఇచ్చే బహుమతి అని నేను నమ్ముతాను. అలాగే టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు ఈ కారక్రమానికి రావడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుండి పరిచయం. ఆయన వచ్చి పట్టుబట్టి నాతో ఈ పాత్ర చేయించడం జరిగింది.
ఎలా చేశాను అన్నది నేను కూడా మీతో పాటే చూడాలి. అలి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. హీరోహీరోయిన్లు కొత్త వారైనా చక్కగా నటించారు. చిత్ర యూనిట్ అందరూ ఎంతో ప్రేమతో నన్ను చాలా బాగా చూసుకున్నారు. సినిమా ఫీల్డ్ ఇంత బాగుంటుందా? అనిపించింది. కళలు అనేవి మన ప్రాచీన సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలు. ప్రపంచంలో ఎక్కడా లేని ఎన్నో కళలకు భారతదేశం పుట్టినిల్లు. అలాంటి ప్రాచీన కళలను మనం కోల్పోతే మన మనుగడనే మనం కోల్పోవాల్సి వస్తుంది. నిర్మల్ బొమ్మ ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలుసు. అంతరించి పోతున్న నిర్మల్ కళలను కథగా తీసుకుని ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. ఒక మంచి చిత్రానికి మీ అందరి ఆదరణ తప్పక ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ``మా ఆహ్వానాన్ని మన్నించి మా సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి వచ్చిన మనసున్న మహారాజు, మంచి మనిషి టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి మా రాధాకృష్ణ యూనిట్ తరపుణ హృదయపూర్వక కృతజ్ఞతలు. మంచి కాన్సెప్ట్‌తో చేసిన ఒక మంచి సినిమా. ఇటీవల సెన్సార్ జరుపుకున్న నేపథ్యంలో సెన్సార్ ఆఫీసర్ మాట్లాడుతూ నేను సెన్సార్ ఆఫీసర్ అయ్యాక దాదాపు 40 సినిమాలు చూడడం జరిగింది. ఈ నలబై సినిమాల్లో నేను చూసిన ది బెస్ట్ సినిమా ఇది అని చెప్పడం జరిగింది. మంచి సదుద్దేశ్యంతో ఒక మంచి సినిమా తీశారు అని సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది.
ఈ సినిమాకి ఇలాంటి ప్రశంసలు వస్తాయని నాకు ముందే తెలుసు అందుకే ధైర్యంతో అమ్మ లక్ష్మీపార్వతి గారి దగ్గరకు వెళ్లి సినిమాకు మూలస్తంభం లాంటి క్యారెక్టర్ తప్పకుండా మీరు చేస్తే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది అని ఆమెకు కధ చెప్పడం జరిగింది. వారి పాత్రకి తప్పకుండా మంచి ప్రశంసలు వస్తాయి. ఎప్పుడైతే వైవీ సుబ్బారావుగారి లాంటి మంచి మనిషి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారో అప్పుడే ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అని కన్ఫర్మ్ అయిపోయింది`` అన్నారు.
అలీ మాట్లాడుతూ - ``నిర్మల్ బొమ్మ మీద తీసిన ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుంది. హీరోహీరోయిన్లు చక్కగా నటించారు. దర్శకుడు ప్రసాద్ వర్మ అద్బుతంగా తెరకెక్కించారు`` అన్నారు. చిత్ర దర్శకుడు టి.డి ప్రసాద్ వర్మ మాట్లాడుతూ - ``మా అన్నయ్య శ్రీనివాస్ రెడ్డి గారితో 20 సంవత్సరాలు కలిసి వర్క్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌కి చాలా హెల్ప్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నా స్పెషల్ థ్యాంక్స్. లక్ష్మీ పార్వతిగారు ఒక కీలక పాత్రలో నటించారు. ఆమెకు నా కృతజ్ఞతలు. ఎమ్.ఎమ్ శ్రీలేఖ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూడండి అన్నారు.
చిత్ర నిర్మాత పుప్పాల సాగరిక కృష్ణకుమార్ మాట్లాడుతూ, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం.ఎం.శ్రీలేఖగారు.. కొత్త నిర్మాత అయినప్పటికీ ఒప్పుకుని అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమాలో ఎక్సలెంట్ సాంగ్స్ ఉన్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశాం. మిగిలిన పాటలను త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. హీరోకి ఇది రెండో సినిమానే అయినా పాత్రలో ఒదిగిపోయారు. ఇక ముస్కాన్ సేథిగారు కథ వినగానే ఒప్పుకుని ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫామెన్స్ చేశారు. ఆమె మరింత పెద్ద హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను." అన్నారు.
సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్ శ్రీలేఖ మాట్లాడుతూ, ``టిటిడి వైవి సుబ్బారెడ్డి గారు మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగానే అంతా పాజిటీవ్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా నిర్మల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. 5 మంచి పాటలు ఉన్నాయి. ప్రతి పాట చాలా బాగా వచ్చింది. ఇప్పటికే రెండు పాటలు విడుదలచేశాం. మిగతా పాటలు కూడా త్వరలోనే విడుదల చేస్తాం`` అన్నారు. హీరో అనురాగ్ మాట్లాడుతూ,``ఇదొక సాఫ్ట్ లవ్ స్టోరీ. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి, సాగరిక కృష్ణకుమార్ గారికి థ్యాంక్స్. `` అన్నారు.
హీరోయిన్ ముస్కాన్ సేథీ మాట్లాడుతూ,``ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు`` అన్నారు. ఈ కార్యక్రమంలో కో- ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కానూరి, ఎడిటర్ వెంకట ప్రభు తదితరులు పాల్గొన్నారు. అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్), నందమూరి లక్ష్మీ పార్వతి, అలీ, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, ఎడిటింగ్: డి. వెంకటప్రభు, ఆర్ట్: వి. ఎన్ సాయిమణి, కో- ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు, సమర్పణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సారథ్యం: కృష్ణ కుమార్, నిర్మాత: పుప్పాల సాగరిక, కృష్ణకుమార్, దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ.