బాలీవుడ్, టాలీవుడ్ చిత్రపరిశ్రమలను ఒకదానితో ఒకటి పోల్చడం ఏమాత్రం భావ్యం కాదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రేక్షకుల భావోద్వేగాల మీద సినిమా ఫలితం ఆధారపడివుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి చిన్న విషయం వివాదాస్పదం అవుతుందని ఆమె వాపోయారు.
గత కొన్ని రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఫలితంగా గత యేడాది ఏకంగా ఐదు హిందీ చిత్రాల్లో నటించింది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్, టాలీవుడ్ చిత్రపరిశ్రమలను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై తాజాగా వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శించింది. హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు రెండూ ఒక్కటేనని చెప్పారు. వాటిలో ఒకదానితో మరొకదాన్ని పోల్చరాదని అన్నారు. అన్నిటికన్నా ప్రేక్షకులే ముఖ్యమన్నారు.
మంచి కథా చిత్రాలను ప్రేక్షకులు ఎల్లవేళలా ఆదరిస్తారని తెలిపారు. మన దేశంలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారని, వారు మన దేశ సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చే సినిమాలను రూపొందించగలరని చెప్పారు.
ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగిందని, సినిమా బాగుంటే థియేటర్‌లో ఓటీటీలో కూడా చూస్తారని తెలిపింది. ప్రేక్షకుల ఎమోషన్స్ మీదే సినిమాల ఫలితం ఆధారపడివుంటుందని ఆమె చెప్పుకొచ్చారు.