హీరోయిన్ సమంత తనకు తాను ధైర్యం చెప్పుకుంది. గట్టిగా ఊపిరి పీల్చుకో పాప అంటూ తనకు తాను ధైర్యాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మయోసైటిస్ నుంచి కోలుకుని ఇపుడిపుడే మళ్లీ కెరీర్‌పై దృష్టిసారిస్తున్న సమంత నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 'సిటాడెల్' ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులోభాగంగా, ఆమె తన వర్క్‌లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేశారు. ముఖ్యంగా, కొత్త యేడాదిలో తొలినెల జనవరిలో తన జీవితం ఎలా గడిచిందో ఈ ఫొటోలతో ఆమె స్పష్టం చేశారు. 'సిటాడెల్' టీమ్‌తో మీటింగ్, వర్కౌట్లు, అలసట, ఫొటోషూట్‌లతో గత నెల పూర్తైందంటూనే ఓ ఆసక్తికర పోస్ట్‌తో ఆమె.. తనకు తాను ధైర్యాన్ని ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
'గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను చూస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆలోచించడం మానేశావు.. దేనిపైనా దృష్టిపెట్టలేకపోయావు.. సరిగ్గా నడవలేకపోయావు.. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగువేశావు. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో' అని సామ్ రాసుకొచ్చారు.