నటుడు శివాజీ రాజా గురించి అందరికీ తెలిసిందే. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందాడు శివాజీ రాజా. ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ నిర్మించాడు. ఆయనకున్న స్నేహితులు ఏడిద శ్రీరామ్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్.. ఇలా కొంతమంది వున్నారు. వారంతా ఆయనకు అండగా వుండి `మా` అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. రెండేళ్ళ కాలపరిమితి తర్వాత వారంతా ఆ స్నేహితులే ఎడమొహంగా తయారయ్యారు. అందుకు నిదర్శనం ఇప్పుడు వారంతా ప్రకాష్‌రాజ్ పేనల్‌కు సపోర్ట్ చేస్తున్నవారే.
అయితే ఇప్పుడు శివాజీరా రాజా ఇలా అయిపోయాడేంటి? అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన కరోనా ఫస్ట్ వేవ్‌కు ముందే చాలా పలచగా తయారయ్యారు. ఆయన కుమారుడు రాజాను హీరోగా పరిచయం చేస్తున్న వేయిశుభములుకలుగునీకు సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియో జరిగింది. అప్పటికే ఆయనకు ఆరోగ్యం సరిగాలేదు. హృదయ సంబంధమైన వ్యాధితో అప్పట్లో బాధపడేవారు. ఇప్పుడు కరోనా తర్వాత మరలా అది బయటపడింది. దాంతో ఆయన బయటకు రావడం మానేశాడని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు.
శివాజీరాజాకు హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్ కూడా వుంది. అందులో ఎక్కువ కాలక్షేపం చేస్తుంటారు. అక్కడ పండించే కూరగాయలు, పండ్లు వంటివి చుట్టు పక్కల వారికి తక్కువలో అందజేస్తుంటారు. మాలోని పేద కళాకారులకు కూడా ఆయన మా అధ్యక్షుడిగా కాలం ముగిసినా కూడా వ్యక్తిగతంగా ఆయన దృష్టికి వస్తే ఆదుకున్న సంఘటనలు వున్నాయి కూడా. సో.. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే వున్నారు. కరోనా వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలున్నా ఆయన తన బాడీని తగ్గించుకున్నాడు. తన ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో ఆయన కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేశారు కూడా. ఇలా శివాజీరాజాను ప్రమోట్ చేస్తున్నారా! అంటూ ఆయన సన్నిహితుడు ఏడిద శ్రీరామ్ వ్యాఖ్యానించారు.