తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో తమ మధ్య చర్చకు రాని అంశాలు కూడా చర్చించినట్టుగా ఫేక్ వార్తలు రాస్తున్నారంటూ తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మండిపడ్డారు. సీఎం మీటింగ్ లో అసలు జరగనివి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది పెద్దలు గురువారం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన విషయం తెల్సిందే. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దీనిపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగిందని, 0.5 పర్సెంట్ కూడా నెగిటివిటీ లేదని స్పష్టం చేశారు. ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని వివరించారు.
'ఇవాళ సమావేశంలో బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్ల గురించి అసలు టాపిక్కే రాలేదు. పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియోలు మాకు ప్రదర్శించలేదు. బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు. ప్రతిదీ జవాబుదారీతనంతో ఉండాలి అని డీజీపీ సూచించారు.
హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ నగరానికి ఐటీ, ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమ కూడా అంతే కీలకంగా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని కోరినట్టు తెలిపారు. అలాగే, గద్దర్ అవార్డుల కార్యక్రమం ఎఫ్.డి.సితో అనుసంధానంగా జరగాలి అని చెప్పారు.
సీఎం గారు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు కోసం తన సలహాలు, సూచనలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మేము ఆయనిచ్చిన సలహాలు, సూచనలపై దృష్టి పెడతాం. తదుపరి సమావేశంలో వివరణాత్మక ప్రతిపాదనను ఆయన ముందు ఉంచతాం" అని అన్నారు.