Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కథకు పట్టం కట్టిన నిత్య కృషీవలుడు.. రాజీ ఎరుగని బాటసారి దాసరి

సినిమా పరిశ్రమ సర్వ నాశనం కావడానికి, దర్శకుడు జీరో అయిపోయి హీరోనే కథను నిర్ణయించడానికి కారణం సినీ పరిశ్రమే అని దాసరి నారాయణరావు పదే పదే చెబుతూ వచ్చారు. ఇటీవల కాలంలో వివిధ టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా దాసరి ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వచ్చారు

కథకు పట్టం కట్టిన నిత్య కృషీవలుడు.. రాజీ ఎరుగని బాటసారి దాసరి
హైదరాబాద్ , బుధవారం, 31 మే 2017 (06:35 IST)
సినిమా పరిశ్రమ సర్వ నాశనం కావడానికి, దర్శకుడు జీరో అయిపోయి హీరోనే కథను నిర్ణయించడానికి కారణం సినీ పరిశ్రమే అని దాసరి నారాయణరావు పదే పదే చెబుతూ వచ్చారు. ఇటీవల కాలంలో వివిధ టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా దాసరి ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వచ్చారు.  నిర్మాతకు, దర్శకుడికి గౌరవం ఇవ్వని కాలం వచ్చి సినిమా కళలోని 24 ప్రేములను హీరో నిర్ణయించే దౌర్భాగ్యం వచ్చినప్పటినుంచే సినీపరిశ్రమ పతనం మొదలైందని, మళ్లీ దర్శక నిర్మాతలకు పట్టం గట్టే రోజులు వచ్చినప్పుడే సినిమా సగర్వంగా లేచి నిలబడుతుందని దాసరి చెప్పారు. 
 
మరొక ముఖ్యమైన విషయం ఏమటంటే కథ విషయంలో దాసరి ఏమాత్రం రాజీపడక పోవడమే. దర్శకునిగా ప్రయాణం ప్రారంభించినప్పట్నుంచి ఆ ఒక్కదాని ముందు దాసరి వినమ్రంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ ఒక్కటి ఏమిటి?  కథ, సినిమా కథ. తాను రాసిన కథ ఎవర్ని కోరితే వాళ్లతోనే సినిమాలు తీసిన దర్శకుడు దాసరి నారాయణరావు. తొలి సినిమా ‘తాతా మనవడు’ నుంచి మొదలుపెడితే 2014లో తీసిన చివరి సినిమా ‘ఎర్ర బస్సు’ వరకు ఆయన తన దారి మార్చుకోలేదు. 
 
రెండు తరాల అగ్ర నటులతో, హీరోలతో పని చేశారాయన. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజులతో పాటు తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో సినిమాలు తీశారు. స్టార్‌ దర్శకునిగా పేరొచ్చిన తర్వాత కొత్త నటీనటులతో, తక్కువ నిర్మాణ వ్యయంలో సినిమాలు తీయడానికి వెనుకాడలేదు. కథకు పట్టం కట్టిన నిత్య కృషీవలుడు.
 
తొలి సినిమా ‘తాతా మనవడు’లో ‘అనుబంధం అత్మీయత అంతా ఓ బూటకం’ అంటూ కన్నకొడుకు నిరాదరణకు గురైన తల్లిదండ్రల ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించారు. స్వర్గం–నరకం, మేఘ సందేశం, కంటే కూతుర్నే కను వంటి సినిమాల్లో ప్రేక్షకుల హృదయపు లోతుల్లో తడిని తట్టి లేపారు. దాసరి ఫ్యామిలీ సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ‘తాండ్ర పాపారాయుడు‘, ‘బొబ్బిలి పులి‘, ‘సర్దార్‌ పాపారాయుడు‘ వంటి కమర్షియల్‌ సినిమాలతో గర్జించారు. ‘ప్రేమాభిషేకం‘, ‘మజ్ను‘ సినిమాల్లో ప్రేమను ప్రేక్షకులకు చూపారు. ‘ఒసేయ్‌ రాములమ్మ’లో సమాజంలో అసమానతలను ఎత్తి చూపారు. 
 
ఈ సినిమాలు దాసరి తీసిన ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’ ఇలా ఎన్నో ఎన్నెన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారాయన. ఆయన ప్రతిభకు మెచ్చి పలు అవార్డులు సలాం చేశాయి. రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను దాసరి అందుకున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన మరో బాలచందర్ మన దాసరి