'భోళా శంకర్" సినిమా నిర్మాతలపై హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు చీటింగ్ తో పాటు వివిధ కేసులు నమోదుచేసింది. అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్" సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారని, ఆ సినిమాకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి మూడు రాష్ట్రాల హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ ను బ్యాంకు ద్వారా తాను చెల్లించడం జరిగిందని, అయితే తనకు కేవలం విశాఖపట్నం వరకే తనకు హక్కులను ఇచ్చారని శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైజాగ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్) వెల్లడించారు.
ఈ నేపధ్యంలో తాను వెళ్లి నిర్మాతలను సంప్రదించగా, 'భోళా శంకర్" సినిమా విడుదలకు ముందు తన డబ్బులు తిరిగి చెల్లిస్తామని అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చారని సతీష్ వివరించారు. గత పదమూడేళ్లుగా వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా "రంగస్థలం" వంటి అనేక పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన తనకు సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధం వల్ల తనకు రావలసిన డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించానని, అయితే వారు తనను పట్టించుకోలేదని, తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని, దాంతో తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు.. నేను చెల్లించిన 30 కోట్ల రూపాయల డబ్బును రికవరీ చేసుకునేందుకు సూట్ ఫైల్ చేసుకోమని హైదరాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చిందని , ఆ మేరకు న్యాయ పోరాటం చేస్తున్నామని సతీష్ స్పష్టం చేశారు. మరోవైపు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సదరు నిర్మాతలపై వివిధ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన చెప్పారు.
అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ మాట్లాడుతూ, బత్తుల సత్యనారాయణ (సతీష్) ను మోసం చేసిన వారిపై న్యాయస్థానంలో సివిల్ కేసులకు సంబందించిన వాదనలు కొనసాగుతున్నాయని అన్నారు. న్యాయం సతీష్ పక్షాన ఉన్నందున తాము తప్పకుండా గెలుస్తామని, ఆ మేరకు సదరు నిర్మాతలపై రికవరీ సూట్ ఫైల్ చేసుకోమని కోర్టు చెప్పిందని ఆయన తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్ ను మోసం చేసిన భోళా శంకర్ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, ఇంకా వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం,వంటి వివిధ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు.
సతీష్ కు న్యాయం జరగడం కోసం ఎంత దూరమైనా వెళతాం: నట్టి కుమార్
సినిమా వ్యాపారం ఎన్నో ఏళ్లుగా నమ్మకం మీద సాగుతూ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బావుంటేనే సినీ పరిశ్రమ బావుంటుంది. అయితే వారిని మోసం చేయడం అన్నది ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వంటివి మోసపోయిన వారి వైపు కాకుండా, మోసం చేసిన వారికి సపోర్ట్ గా నిలుస్తుండటం చాలా భాధను కలిగిస్తోంది. నాకు మంచి మిత్రుడైన వైజాగ్ సతీష్ కూడా వాటి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో న్యాయస్థానంకు వెళ్లారు. 30 కోట్లు చెల్లించి, సదరు నిర్మాతల చేతిలో మోసపోయిన సతీష్ కు న్యాయం జరగడం కోసం నేను తనవైపు సపోర్ట్ గా నిలిచాను. సదరు నిర్మాతలు ఐటీ, జీఎస్టీ వంటివి కట్టకుండా, చాలాకాలంగా గవర్నమెంట్ ను మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వాటి అన్నింటిపైనా ఫిర్యాదులు చేయబోతున్నాం. సతీష్ కు పూర్తి న్యాయం జరిగేంతవరకు ఎంతదూరమైనా వెళతాం. ఇప్పటికే నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసులు రిజిస్టర్ అయ్యాయి. అలాగే సివిల్ కోర్టులో మెయిన్ కేసు కొనసాగుతోంది.