కరోనా వైరస్ వలన మార్చి నెల నుంచే సినిమా హాల్స్ మూసేయడం తెలిసిందే. దీని వలన ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అయితే.. లాక్ డౌన్ తర్వాత అయినా సినిమా హాల్లు ఓపెన్ చేస్తారా అంటే.. ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసినా... జనం వస్తారా రారా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ దీని గురించే ఆలోచిస్తున్నారు.
ప్రజలందరి ఆర్ధిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతో జనాలు టిక్కెట్టు కొనుక్కొని సినిమాకి వస్తారా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని నిర్మాతలందరినీ ఆలోచనలోపడేసింది. అయితే... జనాల్ని సినిమా థియేటర్‌కి రప్పించడం కోసం టాప్ ప్రొడ్యూసర్స్ టిక్కెట్టు రేట్లు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు థియేటర్లో ఇప్పటివరకు ఉన్న సీట్లలో 50 శాతం మాత్రమే టిక్కెట్లు అమ్మాలని.. ఆ విధంగా చేయడం వలన థియేటర్లో ప్రేక్షకుడికి ప్రేక్షకుడికి మధ్య మూడు నాలుగు సీట్ల గ్యాప్ ఉంటుందని ఇలా చేస్తే మంచిదని.. ప్రస్తుతం దీని గురించి నిర్మాతల మండలిలో చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే ఈ విషయం గురించి ప్రభుత్వంతో చిత్ర నిర్మాతలు చర్చిస్తారని తెలిసింది. మరి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.