క్యాస్టింగ్ కౌచ్‌లు, సినిమా ఫీల్డ్‌లోని ఇతరత్రా వేధింపులు ఎలా ఉన్నప్పటికీ... ఫోన్‌లలో మహిళల పట్ల వేధింపులు అనేవి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయాలే. ఫోన్ ఎత్తిన వ్యక్తి మహిళ అయితే... చాలు పని ఉన్నా... లేకపోయినా ఫోన్‌లు చేసేయడం, మెసేజ్‌లు చేస్తూ వేధించడం అనేక చోట్ల వింటూనే ఉన్నాము... అటువంటి ఒక సంఘటనను గురించే సింగర్ మాళవిక ఇటీవల చెప్పుకొచ్చింది.
వివరాలలోకి వెళ్తే... చిన్నతనంలోనే సింగర్‌గా ప్రశంసలు అందుకున్న మాళవిక.. ఆ తర్వాత పలు చిత్రాలలో పాటలు పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' అనే కార్యక్రమంలో మాట్లాడుతూ... గతంలో తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బహిర్గతం చేశారు.
"నేను వరుసగా సినిమాలలో పాడుతూ బిజీగా వున్న రోజుల్లో ఒక వ్యక్తి తరచూ మా ఇంటికి కాల్ చేసేవాడు. ఉదయం.. సాయంత్రం.. రాత్రి అని లేకుండా మెస్సేజ్‌లు పెడ్తూండేవాడు. అతను ఎవరో తెలియకపోయినా.. పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఊరుకున్నాం.
కానీ ఒకసారి నేను, శివారెడ్డి, గీతామాధురి, అభినయ కృష్ణ కలిసి ఒక ఈవెంట్‌కి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఒక మెస్సేజ్ పెట్టాడు.. అందులో చనిపోయిన కొంతమంది సెలబ్రిటీల జాబితాలో నా పేరు కూడా చేర్చి.. డెత్ డే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. దాంతో నేను నాతోపాటు ఉన్న శివారెడ్డి, గీతామాధురిలకు విషయం చెప్పాను.
దాంతో శివారెడ్డి తన ఫోన్ నుంచి అవతలి వ్యక్తికి కాల్ చేసి.. డీఎస్పీనంటూ వాయిస్ మార్చి మాట్లాడాడు. ఇంకోసారి మాళవికను ఇబ్బంది పెడితే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించాడు. అంతే ఆ రోజు నుంచి కాల్స్ గానీ.. మెస్సేజ్‌లు గానీ లేవు. శివారెడ్డి మిమిక్రీ నన్ను పెద్ద ఇబ్బంది నుంచి బయటపడేసింది" అంటూ చెప్పుకొచ్చింది.
మరి అందరికీ... శివారెడ్డిలాంటి వాళ్లు అందుబాటులో ఉంటే బాగుంటుందేమో కదా.