అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నరసింహారెడ్డి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాగే... సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు ఏం మాట్లాడతారు అని కూడా అంతే ఆసక్తితో ఎదురుచూసారు.
ఈ వేడుకలో చిరు మాట్లాడుతూ... భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ మెగాస్టార్ ఏం మాట్లాడారంటే... సెప్టెంబరు 22 అనే తేదీ తన జీవితంలో మర్చిపోలేని తేదీ అని చెప్పారు.
1978 సెప్టెంబరు 22న తన మొట్టమొదటి చిత్రం ప్రాణంఖరీదు రిలీజైందని తెలిపారు. తన భవిష్యత్తు ఎలా ఉంటుంది..? ఈ సినిమాలో తనను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో..? అని ఎంతో ఉద్విగ్నతకు గురయ్యానని, మళ్లీ అదే టెన్షన్ 41 ఏళ్ల తర్వాత అనుభవిస్తున్నానని వివరించారు.
తన ఉద్వేగానికి కారణం సైరా చిత్రమేనని చెప్పారు. తాను ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కథ కోసం అన్వేషిస్తున్న సమయంలో పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చెప్పారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
ఆ కథ విన్నప్పుడు అద్భుతం అనిపించిందని, ఓ యోధుడి కథ చరిత్రలో తెరమరుగైపోయిందన్న ఫీలింగ్ కలిగిందని వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంచనాలకు తగ్గట్టుగా సంచలన విజయం సాధించి తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి తెలియచేస్తుందని ఆశిద్దాం.