మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా సమాజసేవలో అంకితమయ్యారు. ఇందులోభాగంగా ఆమె కరోనా మాస్కుల తయారీలో నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే సామాజిక భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు ముఖానికి ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మాస్కుల కొరత ఏర్పడింది.
అదేసమయంలో కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో భాగంగా, ప్రతి ఒక్కరూ తమకుతోచిన విధంగా సాయం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు పీఎం, సీఎంల రిలీఫ్ ఫండ్‌కు నిధులందించగా, రిటైర్డ్ సైనికులు లాక్‌డౌన్ అమలులో పోలీసులకు సాయం చేస్తున్నారు.
విశ్రాంత వైద్యులు, తాము సైతం అంటూ కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా ఎంతో మంది కరోనాపై పోరులో సహకరిస్తున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి తనకు చేతనైనంతలో సాయం చేసి, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
తన స్నేహితురాళ్లతో కలిసి, మూడు రోజుల పాటు శ్రమించిన అంజనాదేవి, 700 మాస్క్‌లను తయారు చేసి, వాటిని అవసరమైన వారికి అందించారు. తన వయసును, వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా, ఆమె పడిన శ్రమ, సమాజం పట్ల చూపిన బాధ్యతకు పలువురు ఫిదా అవుతూ, అభినందనల వర్షం కురిపించారు.
అలాగే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి భార్య కావ్య కూడా ఇదే విధంగా మాస్కుల తయారీలో నిమగ్నమైన విషయం తెల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఉన్న తన భార్య, సమయాన్ని సద్వినియోగం చేస్తోందని, ఇంట్లోనే మాస్క్‌లను తయారు చేస్తున్నదని చెబుతూ, ఆ ఫోటోలను కిషన్ రెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కూడా వైరల్ అయిన విషయం తెల్సిందే.