'దండోరా' చిత్రంలో సినిమాలో వేశ్య పాత్రను పోషించడానికి కారణం ఆ సినిమా కథ నచ్చడమేనని నటి బిందు మాధవి అన్నారు. పైగా, ఆ సినిమా ప్రారంభమే తన పాత్ర ప్రవేశంతోనే మొదలవుతుందని చెప్పారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మురళీకాంత్ దర్శకత్వంలో లైక్య ఎంటర్‌టైన్మంట్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో పాత ఆచారాలు, హాస్యం, భావోద్వేగాలు కలబోతగా దండోరా తెరెక్కుతోంది. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో తన పాత్ర గురించి బిందు మాధవి మాట్లాడుతూ, 'దర్శకుడు కథ చెప్పడానికి వచ్చినపుడు సినిమా అపుడే సగం పూర్తయిందని చెప్పారు. దీంతో నా పాత్ర చిన్నదేమో అని మొదట వద్దనుకున్నాను. కానీ, కథ విన్న తర్వాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. నా పాత్ర ఎంట్రీతోనే సినిమా మొత్తం మలుపు తిరుగుతుందని అర్థమైంది. కథలో అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో వెంటనే అంగీకరించాను. ఆ క్షణంలో ఈ పాత్ర నాదే అని ఫిక్స్ అయ్యాను' అని వివరించారు.
సాధారణంగా ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా ధైర్యం కావాలని, అయితే, కథలో ఉన్న బలం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బిందు మాధవి స్పష్టం చేశారు.