తెలుగు సినిమా రంగంలో కొత్తగా వచ్చే మహిళా ఆర్టిస్టులు తమకు ఓ నిర్మాత, దర్శకుడో, కొరియోగ్రాఫర్, మేనేజరో అన్యాయం చేశారంటూ పలు కేసులు వస్తున్నాయి. అందుకే ఇకపై కొన్ని రూల్స్ మార్చాల్సిన అవసరం వుందని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు. జానీ మాస్టర్ ఉదంతం గురించి ఓ మీడియాతో మాట్లాడుతూ, మహిళలను గౌరవించే ఇండస్ట్రీలో జానీ మాస్టర్ పై కేసు పెట్టిన అతని అసిస్టెంట్ స్రష్టి గత కొన్నేళ్ళుగా తనను వేధిస్తున్నాడనీ పేర్కొంది. అయితే ఇన్నేళ్ళ తర్వాత ఇలా చేయడం వెనుక కుట్ర దాగి వుందని అనిపిస్తుంది.
మొదట్లోనే ఆమె జానీ మాస్టర్ పై ఎదురుతిరిగితే బాగుండేది. ఇప్పుడు పోలీసు కేసు అయింది గనుక ఇష్యూ కోర్టుకు వెళ్లింది గనుక అసలు ఆమెకు డాన్సర్ గా సభ్యత్వం ఏ ప్రాతిపదికన ఎవరు ఇచ్చారు? ఇన్నేళ్ళ ఎందుకు మౌనంగా వున్నావు? అనే విషయాలతోపాటు పలు అంశాలు వెలికి తీస్తారు. అప్పుడు కూడా ఆమె నిలబడితే ఆమె నిజాయితీని మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఇరువురి తప్పిదం కనిపిస్తుంది. కనుక శిక్ష పడితే ఇద్దిరికీ పడాల్సిందే.
ముఖ్యంగా ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడకు వచ్చే మహిళలు తమ డ్యూటీని తాము చేసుకోవాలి. తమకు నచ్చిన వ్యక్తితో అండర్ స్టాండింగ్ వున్నప్పుడు నోరు మెదపని వారు ఆ తర్వాత కొన్నేళ్ళకు తమకు అన్యాయం జరిగింది అనడంలో ఏదో రాజకీయ కోణం దాగి వుందనే అనుమానం అందరిలో నెలకొంది. ఇలాంటి ఉదంతాలు తెలుగు సినిమాను భ్రష్టు పట్టించే దిశగా మారాయి. ఏది ఏమైనా పోలీసుల పరిశోధన, కోర్టు విశ్లేషణ జరిగాక ఎవరిది త ప్పయితే వారు శిక్ష అనుభవించాల్సిందే.
ఇటీవలే ఓ నిర్మాత తనను వేధించాడని ఓ మహిళా ఆర్టిస్టు నా దగ్గరకు వచ్చింది. పోలీసులను ఆశ్రయించింది. కానీ నాలుగేళ్ళనాడు జరిగిన ఉదంతమనీ, అసలు ఆ నిర్మాత ఆమెను వేధించలేదని పోలీసు సర్వేలో తేలింది. సో. ఇలాంటి వారుకూడా వున్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవారి పట్ల తగు నియమనిబంధనలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైందని సి. కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.