Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వచ్చిన తర్వాత ధైర్యంగా వెళ్లి షూట్‌‌లో పాల్గొన్నా: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Advertiesment
కరోనా వచ్చిన తర్వాత ధైర్యంగా వెళ్లి షూట్‌‌లో పాల్గొన్నా: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (19:50 IST)
Rakul Preet Singh
క‌రోనా ముందు జ‌రిగిన `చెక్‌` షూటింగ్ గురించి, ఆ త‌ర్వాత చెక్ విడుద‌లైన త‌ర్వాత స్పంద‌న గురించి ర‌కుల్ ప్రీత్ సింగ్ ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ముంబైలో హిందీ సినిమాలో షూటింగ్ బిజీలో వున్న ఆమె చెక్ సినిమా గురించి మాట్లాడారు.
 
కరోనా బారిన ప‌డి కోలుకున్నారు. తర్వాత చిత్రీకరణ చేయడం ఎలా ఉంది?
‘మే డే’ చిత్రీకరణ చేస్తున్నప్పుడు కొవిడ్‌19 వచ్చింది. 12 రోజుల్లో కోలుకున్నా. క్వారంటైన్‌ ఉన్నప్పుడు సమస్యలేవీ లేవు. మొదటి నాలుగు రోజులు నిద్రపోయా. ఐదో రోజు నుంచి యోగా, ప్రాణాయామ, బ్రీతింగ్‌ వర్కవుట్స్‌ చేశా. నా వల్ల చిత్రీకరణ ఆగకూడదని 13వ రోజు నుంచి సెట్స్‌కి వెళ్లా. అప్పుడు బాడీలో అలసట వచ్చింది. కరోనా వల్ల వర్కవుట్స్‌ చేసేటప్పుడు బాడీ పెయిన్స్‌ వచ్చాయి. చేయకపోతే బాగానే ఉండేది. నాకు కరోనా రాక ముందు సెట్స్‌కి వెళ్లడానికి కాస్త భయపడ్డా. వచ్చిన తర్వాత ధైర్యంగా వెళ్లి షూట్‌ చేశా. నాలో యాంటీబాడీస్‌ ఉన్నాయని! కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అందరూ బాధ్యతగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించండి. జాగ్రత్తలు పాటించండి.
 
‘చెక్‌’ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తోంది?
– ప్రస్తుతం హైదరాబాద్‌లో లేను. ముంబైలో ఉన్నాను. హిందీ సినిమా చిత్రీకరణ చేస్తున్నా. అందువల్ల, నేనింకా సినిమా చూడలేదు. నేరుగా ప్రేక్షకుల స్పందన తెలుసుకోలేకపోయా. అయితే, నాకు తెలిసిన కొంతమంది సినిమా చూశారు. వాళ్లకు నచ్చింది. సోషల్‌ మీడియాలో చాలామంది పోస్టులు చేశారు. అవీ చూశా. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చెక్‌’ బావుందని చాలామంది కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. సినిమాతో పాటు నా పాత్ర మానస ప్రేక్షకులకు బాగా నచ్చింది. జైలులో ఓ ఖైదీపై నేను అరిచే సన్నివేశం, పతాక సన్నివేశాల్లో జైలులో నితిన్‌ను కలిసి ఎమోషనల్‌ అయ్యే సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కరోనాకి ముందు ప్రారంభించిన సినిమా. లాక్‌డౌన్‌ వల్ల కాస్త ఆలస్యమైంది. యూనిట్‌ అంతా కష్టపడి చేశాం. ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా.
 
మీరు స్టార్‌ హీరోయిన్‌.  మీకు పాటలేవీ లేవు. మానస పాత్ర గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది?
కథ వినేటప్పుడు ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు కొంచెం భిన్నంగా ఉందా? లేదా? అని ఆలోచిస్తా. మాసన పాత్ర విన్నప్పుడు తనొక సాధారణ న్యాయవాది కాదు. జైలుకు వెళ్లడానికి ఆమె భయపడుతుంది. క్రిమినల్‌ను చూసి హార్ట్‌బీట్‌ పెరుగుతుంది. భయాన్ని దాటి ఆ కేసును టేకప్‌ చేసి వాదిస్తుంది. మానస క్యారెక్టర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్‌ నాకు నచ్చింది. ఆవిడలో మార్పు వస్తుంది. ఎప్పుడైనా సరే సినిమా ప్రారంభంలో క్యారెక్టర్‌ ఓ విధంగా ఉండి, పోనుపోనూ మార్పు వస్తే అటువంటి క్యారెక్టర్లలో నటించేటప్పుడు ఎంజాయ్‌ చేయవచ్చు.
 
చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తొలిసారి నటించారు. ఇంతకు ముందు ఆయన సినిమాలు చూశారా?
రెండు చిత్రాలు చూశా. సార్‌ నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌ చాలా బావుంటుందని ముందే ఊహించా. తర్వాత ఆయన్ను కలిసి కథ విన్నాను. చంద్రశేఖర్‌గారు ముందే ‘ఇది రెగ్యులర్‌ హీరోయిన్‌ రోల్‌ కాదు. ఎక్కువ మేకప్‌ ఉండదు. సాంగ్స్‌ ఉండవు’ అన్నారు. ‘ఏం పర్వాలేదు. మంచి వెయిట్‌ ఉన్న క్యారెక్టర్‌ అయితే చేస్తాను’ అని చెప్పా. రోజూ సెట్‌కి వెళ్లేటప్పుడు నాకు ఎగ్జైట్‌మెంట్‌ ఉండాలి. ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్‌ను రిపీట్‌ చేయడం లేదని! కొత్తగా ప్రయత్నిస్తున్నానని! ప్రయత్నం చేసినప్పుడే నేర్చుకోగలుగుతాం. యేలేటిగారు షూట్‌ చేసిన విధానం గానీ, క్యారెక్టరైజేషన్‌ గానీ, సెట్‌లో వాతావరణం గానీ నచ్చాయి. మీరు సినిమాలో నితిన్‌ను చూస్తే అతను ఇంతకు ముందు చేసిన సినిమాలకు, ఈ సినిమాకు బాడీ లాంగ్వేజ్‌లో చాలా మార్పు ఉంటుంది. ఈ మూవీలో నితిన్‌ క్యారెక్టరైజేషన్‌ డిఫరెంట్‌గా ఉంది. యేలేటిగారు వెరీ వెరీ స్వీట్‌. డెడికేటెడ్‌ డైరెక్టర్‌.
 
ఈ సినిమాతో కొత్త తరహా పాత్రలు చేయడానికి ముందడుగు వేశారనుకోవచ్చా?
నేను అంత ఆలోచించలేదు. నాకు స్ర్కిప్ట్‌ నచ్చింది. మేం ఓ ప్రయత్నం చేశాం. నాతోనే నాకు పోటీ. నా లాస్ట్‌ సినిమాకి, ప్రజెంట్‌ సినిమాకి కంపేర్‌ చేస్తే నా పర్ఫార్మెన్స్‌ మెరుగవ్వాలి. నేనెప్పుడూ ఆలోచించేది అదే. ఈ సినిమా తర్వాత తెలుగులో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేశా. అందులో వైష్ణవ్‌ తేజ్‌ హీరో. మేమిద్దం గ్రామీణ యువతీయువకుల పాత్రల్లో నటించాం. డిఫరెంట్‌ రోల్‌ కాబట్టి ఎగ్జైట్‌ అయ్యా. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తున్నా. అందులో నాలుగు కమర్షియల్‌ సినిమాలే. ఇంకొకటి డిఫరెంట్‌ సినిమా. ఏ సినిమాలను అయితే ఐదేళ్ల క్రితం కమర్షియల్‌ కాదని అన్నారో ఇప్పుడు అవే కమర్షియల్‌ సినిమాలు అయ్యాయి. ఐదేళ్ల క్రితం ఒక సెక్షన్‌/సెగ్మెంట్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ కోసం తీసే సినిమాలు అని వేటిని అనుకున్నావో ఇప్పుడు ఆ సినిమాలను అందరూ చూస్తున్నారు. ప్రేక్షకులు హాలీవుడ్‌ సినిమాలు, ఓటీటీల్లో మంచి కంటెంట్‌ చూస్తున్నారు. అందువల్ల, ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలు ప్రయత్నిస్తూ ఉండాలి. మళ్లీ సేమ్‌ సినిమాలు రిపీట్‌ చేస్తే ఆడియన్స్‌కి బోర్‌ కొడుతుంది.
 
భవ్య క్రియేషన్స్‌లో ‘లౌక్యం’ చేశారు. మళ్లీ ఇప్పుడు ‘చెక్‌’ చేశారు. నిర్మాణ సంస్థ గురించి?
గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ‘లౌక్యం’ కానీ, ఇప్పుడు ‘చెక్‌’ కానీ చిత్రీకరణ అంతా బాగా జరిగింది. నిర్మాత ఆనందప్రసాద్‌గారు వెరీ స్వీట్‌ పర్సన్‌.
మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. బాలీవుడ్‌ సినిమా సెట్‌లోనూ తెలుగు మాట్లాడేస్తున్నారా?
అవును. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ నుంచి నా అసిస్టెంట్స్‌ సేమ్‌. తెలుగువాళ్లే. వాళ్లతో నేను తెలుగులో మాట్లాడతాను. అర్జున్‌ కపూర్‌తో నేను నటించిన ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ రీసెంట్‌గా ఆ సినిమా కోసం ప్రమోషనల్‌ సాంగ్‌ షూట్‌ చేశాం. దానికి సినిమాటోగ్రాఫర్‌ తెలుగు వ్యక్తి. మేం తెలుగులో మాట్లాడుకున్నాం. తెలుగువాళ్లు ఎవరైనా కనిపిస్తే నేను తెలుగులో మాట్లాడతా. పంజాబీ కన్నా తెలుగుమ్మాయి అయిపోయా. ‘నీ పేరులో ప్రీత్‌ సింగ్‌ లేదంటే నిన్నుతెలుగమ్మాయి అనుకుంటారు’ అని అర్జున్‌ కపూర్‌ చెప్పారు. విశేషం ఏంటంటే ఆ సినిమాలో నేను సౌతిండియన్‌ అమ్మాయి రాధ పాత్రలో నటించా.
 
ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాలు?
అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌ బచ్చన్‌తో ‘మే డే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ మూవీ మేలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది. జాన్‌ అబ్రహంతో ‘ఎటాక్‌’ చేశా. ఆగస్టులో విడుదలవుతుంది. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘థాంక్‌ గాడ్‌’ చేస్తున్నా. ఆయుష్మాన్‌ ఖురానాతో ‘డాక్టర్‌ బి’ చేస్తున్నా. ఇంకో హిందీ సినిమాలు ఉన్నాయి. మార్చిలో ప్రకటిస్తారు. తమిళంలో శివ కార్తికేయన్‌తో చేసిన ‘అయలాన్‌’ సినిమా ఈ ఏడాదే విడుదలవుతుంది. తెలుగులో వైష్ణవ్ తేజ్ సినిమా కూడా ఈ ఏడాది విడుదల అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజల్ అగర్వాల్ ఫోటోకు కామెంట్ ఇచ్చిన సమంత...?