సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం లవ్ యు రామ్. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర కథా రచయిత, నిర్మాత దశరధ్ విలేకరుల సమావేశంలో లవ్ యు రామ్ విశేషాలని పంచుకున్నారు.
తొలిసారి ఈ చిత్రంలో నటించారు కదా ? నటుడిగా ఎలాంటి అనుభూతి పొందారు ?
తప్పని పరిస్థితిలో నటించాల్సి వచ్చింది (నవ్వుతూ). కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో కొంత జరుగుతుంది. ముందు మేము ఇండియాలో షూట్ చేశాం. అమెరికా వీసాలు రావడం కొంచెం కష్టంగా వుంది. మా అందరికీ బి1 బి 2 వీసాలు వున్నాయి. ఇండియాలో ఈ పాత్ర చేస్తున్న నటుడికి వీసా రాలేదంటే ఇండియాలో చేసిన షూటింగ్ వృధా అవుతుంది. ఆ భయంతో ఆ పాత్రని నేను చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మొదట ట్రయిల్ షూట్ చేశాం. అందరికీ నచ్చింది. ఇప్పటివరకూ సినిమా చూసిన అందరూ అభినందించారు. నేను ఎప్పుడూ కెమెరా ముందుకు రాలేదు. విచిత్రంగా ఇది జరిగింది.
మరి నటన కొనసాగిస్తారా ?
లేదండీ. ఐతే ఒక్కటి మాత్రం నిజం.. సక్సెస్ ఐతే మాత్రం దర్శకత్వం కంటే నటన చాలా సుఖం.
లవ్ యు రామ్ కథ గురించి చెప్పండి ?
ఈ చిత్ర దర్శకుడు డివై చౌదరి నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఓటీటీలు ఓపెన్ అయ్యాక ఓ మూడు వెబ్ సిరీస్ లు చేశాం. అందులో భాగంగా ఒక చిన్న లవ్ స్టొరీ చేద్దామని భావించాం. అప్పటికే నేను ఒక కథపై పని చేస్తున్నాను. ఈ జనరేషన్ లవ్ స్టొరీ ఎలా వుండాలి ? అని ప్రశ్నించుకున్నపుడు.. ఒకప్పుడు పిల్లల ప్రేమకు తల్లిదండ్రులు విలన్ గా వుండేవాళ్ళు. ప్రేమకు వాళ్ళు అంగీకారం తెలపకపోతేనే సమస్య. ఐతే కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రేమికుల మధ్య వచ్చిన గొడవలే ప్రేమకు విలన్స్ గా మారుతున్నాయి.
ఇప్పుడు దాదాపు అన్ని ప్రేమలు సోషల్ మీడియాలో మొదలవుతున్నాయి. పోస్టులకు లైక్ కొట్టి నెంబర్లు ఇచ్చిపుచుకొని ఓ మూడు నెలలు తర్వాత కలుసుకొని ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు. కలసినప్పుడే విపరీతమైన ప్రేమ వుంటుంది. ఐతే హ్యూమన్ నేచర్ ప్రకారం ముందు మనలోని మంచే చూపిస్తాం. ఐతే ప్రయాణం మొదలైన తర్వాత మనలోని ఒక్కొక్క నెగిటివ్ లేయర్ బయటపడుతుంది. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రేమకథ పరిస్థితి ఏమిటి ? ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరిని ఇష్టపడుతుంది. అతనే ఆ అమ్మాయికి స్ఫూర్తిని ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కాలగమనంలో వేరే క్యారెక్టర్ అయిపోయాడని తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ? అనేది ఈ జనరేషన్ కి నచ్చేలా ఈ కథ వుంటుంది. చాలా మంది జీవితాల్లో జరిగే కథ ఇది. సెకండ్ హాఫ్ బ్యూటీ ఏమిటంటే.. మూడు రోజుల్లో జరుగుతుంది. పెళ్లి నుంచి శోభనం మధ్యలో జరిగే లవ్ స్టొరీ రాశాం. ఇది చాలా కొత్తగా వుంటుంది.
కొత్తవారితో చేశారు కదా.. యూరప్ లో షూట్ చేయడానికి కారణం ?
కథ రాసుకున్నప్పుడే అనుకున్నాం. ఈ కథకు సరిపోయేవారినే తీసుకున్నాం. కథకు తగినట్లు ఖర్చు చేశాం. ఐతే అమెరికా వీసాలు ఇబ్బంది రావడంతో నార్వే వెళ్లాం. అది ప్రపంచంలోనే కాస్ట్లీ కంట్రీ అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అందరం కలసి ఉండటానికి ఒక ఇల్లు తీసుకుంటే 18 గంటలకు 85 వేలు ఛార్జ్ చేశారు. పైగా విపరీతంగా వర్షాలు. ఐతే ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం చాలా బావొచ్చింది.
రోహిత్, అపర్ణ నటన గురించి ?
రోహిత్, అపర్ణ లాంటి నటులు దొరకడం మా అదృష్టం. చాలా అంకింతభావంతో అద్భుతంగా నటించారు. ఈ జనరేషన్ చాలా సిన్సియర్ గా ఉంటున్నారు. ముందుకు వెళ్లాలనే కసితో పని చేస్తున్నారు. ఇది యూత్ ఫుల్ స్టొరీ. అందరికీ నచ్చుతుంది.
మ్యూజిక్ గురించి ?
వేద చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. తనకి చాలా అనుభవం వుంది. దాదాపు డెబ్బై సినిమాలకు నేపధ్య సంగీతం ఇచ్చాడు. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.