గాలి మృతిపై బాలయ్య - మోహన్‌బాబు - రోహిత్‌లు ఏమన్నారు?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అర్థరాత్రి హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపై టీడీపీ సీనియర్ నేతలు, సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అర్థరాత్రి హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపై టీడీపీ సీనియర్ నేతలు, సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, సినీ నటుడు బాలకృష్ణ స్పందిస్తూ, గాలి ముద్దుకృష్ణమనాయుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అలాగే, సినీ హీరో మోహన్ బాబు మాట్లాడుతూ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. ముద్దుకృష్ణమనాయుడి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ముద్దుకృష్ణమతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుకుతెచ్చుకున్నారు.
'తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ముద్దుకృష్ణమనాయుడు ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఆయన బ్రదర్, నేనూ క్లాస్‌మేట్స్. నాకు ముద్దుకృష్ణమనాయుడు అత్యంత సన్నిహితుడు. ఎన్నికల సమయాల్లో చాలాసార్లు ఆయన తరపున ప్రచారం చేశాను. అలాంటి మిత్రుడి హఠాన్మరణం నా మనసును కలిచివేసింది. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు ఆ శిరడీ సాయినాథుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
ఇకపోతే, యువ హీరో నారా రోహిత్ స్పందిస్తూ, టీడీపీకి, తెలుగు రాష్ట్ర ప్రజలకు గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం తీరని లోటన్నారు. 'మా కుటుంబానికి గాలి ముద్దుకృష్ణమ నాయుడు అత్యంత సన్నిహితులు. ప్రజల పట్ల విశేషమైన అభిమానం కలిగిన రాజకీయనాయకుడు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకు తీరని లోటు. ఒక మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నారా రోహిత్ అన్నారు.