ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ భారత్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న దేశంలో మొత్తం 2,500 స్క్రీన్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా ఇన్ని స్క్రీన్‌లపై విడుదల కావడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకు ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇంత భారీ స్థాయిలో విడుదల కాలేదు. ఈ సినిమా విడుదలకు అవెంజర్స్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘అవెంజర్స్’కు తమిళ్ రాకర్స్ షాక్ ఇచ్చారు. విడుదలకు రెండు రోజుల ముందే మొత్తం సినిమాను ఆన్‌లైన్‌లో లీక్ చేసేశారు.
‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ చిత్రాన్ని ఈనెల 24న జర్మనీ, సింగపూర్‌తో పాటు ఇతర దేశాల్లో విడుదల చేశారు. ఇండియాలో మాత్రం ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. దీంతో ఇక్కడ విడుదల కావడానికి రెండు రోజుల ముందే మొత్తం సినిమాను తమిళ్‌రాకర్స్ ఆన్‌లైన్‌లో పెట్టేశారు.
అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఆన్‌లైన్‌లో లీకైతే దాని ప్రభావం బాక్సాఫీసుపై పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. కాగా సినీ విశ్లేషకులు మాత్రం దీని వల్ల నష్టం ఏమీ లేదని, ఇలాంటి సినిమాను థియేటర్‌లో చూస్తేనే బాగుంటుందని, మార్వల్స్ అభిమానులెవరూ ఈ సినిమాను పైరసీ కాపీ రూపంలో చూడాలనుకోరని అభిప్రాయపడుతున్నారు.