ప్రతి యేడాది మార్చి ఎనిమిదో తేదీన మహిళా ప్రపంచ దినోత్సవం జరుగుతుంది. ఆ రోజున తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. ఆమె నటిస్తున్న కథనం చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు.
నిజానికి అనసూయ ఒకవైపు బుల్లితెరపై రాణిస్తూనే.. వెండితరపై అడపాదడపా కనిపిస్తున్నారు. గతంలో నాగర్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో హీరో మరదలుగా నటించింది. ఆ తర్వాత 'క్షణం' చిత్రంలో ఏసీపీ జయగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది. అలాగే, గత యేడాది చెర్రీ హీరోగా వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్తగా నటించి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందింది.
ఇపుడు కూడా మరో పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుంది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో "కథనం" అనే పేరుతో ఓ చిత్రం చేస్తుంది. ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో గాయత్రి ఫిలింస్ బ్యానర్‌పై బట్టిపాటి నరేంద్రరెడ్డి, సర్మా చుక్క నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, ధనరాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. గత యేడాది దసరా శుభాకాంక్షలతో చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇది అభిమానులని ఆకట్టుకుంది. ఇక ఉమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా కథనం చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇందులో అనసూయ జర్నలిస్టు లేదా రచయితగా కనిపించనుందనే ప్రచారం సాగుతోంది.