యాక్షన్ కింగ్ అర్జున్‌పై కన్నడ నటి శృతి హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. 'నిబుణన్' అనే తమిళ చిత్రం షూటింగ్ సమయంలో కింగ్ అర్జున్ తనను అసభ్యంగా తాకుతూ వేధించాడని శ్రుతి హరిహరన్ ఆరోపించింది. షూటింగ్ సమయంలో సినిమాను ఆపడం ఇష్టంలేక అప్పుడు తాను మిన్నకుండిపోయినట్టు చెప్పింది.
ఎంతో మంచిపేరున్న అర్జున్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ విస్మయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అర్జున్‌కు ఆయన కుమార్తె ఐశ్వర్య అండగా నిలిచింది. సినిమా స్క్రిప్టులో రెండు అభ్యంతరకరమైన సీన్లు ఉంటే, వాటిని తొలగిస్తేనే నటిస్తానని తన తండ్రి కరాఖండిగా చెప్పేశారని ఐశ్వర్య అన్నారు.
పైగా, తన సినిమా స్క్రిప్ట్‌లను తమను కూడా వినమని అర్జున్ చెబుతారన్నారు. సినిమా షూటింగ్‌లో శ్రుతి ఐదు రోజులు మాత్రమే పాల్గొన్నారన్నారు. పబ్‌కు, డిన్నర్‌కు రావాలని అర్జున్ ఒత్తిడి చేసినట్లు శ్రుతి చెప్పడంపై ఐశ్వర్య స్పందించారు. తన ఇన్నేళ్ల జీవితంలో తండ్రి అర్జున్ పబ్‌కు వెళ్లడాన్ని తానెప్పుడూ చూడలేదని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
అలాంటిది తన తండ్రి రిసార్ట్‌కు, డిన్నర్‌కు రావాల్సిందిగా వేధించినట్లు శ్రుతి హరిహరన్ చెప్పడం నమ్మబుద్ది కావడం లేదన్నారు. శ్రుతి హరిహరన్ కేవలం సొంత ప్రయోజనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తోందని ఐశ్వర్య విమర్శించారు. ఇటీవలి కాలంలో పబ్లిసిటీ కోసం ఇలాంటి చీఫ్ ఆరోపణలు చేయడం షరామామూలైపోయిందని ఐశ్వర్య ఆరోపించింది.