భావితరాలకు నల్లమల అటవీప్రాంతం కనిపించదా? ఈ అందమైన అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసేందుకు పాలకులు నిర్ణయించుకున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే నల్లమల ఫారెస్ట్ ఇకపై చరిత్ర పుటల్లో మాత్రమే కనిపించేలా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం తవ్వాలని భావిస్తున్నారు. దీన్ని పలువురు సినీ నటులు తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
యురేనియం తవ్వకాల వల్ల 20 వేల ఎకరాల అటవీ ప్రాంతం నాశనమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా "సేవ్ నల్లమల" ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. 'మనం చెరువులను నాశనం చేసుకున్నాం. సహజ వనరులు దెబ్బతినడం వల్ల కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టిని చూశాం. తాగునీటి వనరులు కలుషితమయ్యాయి.
అన్నిచోట్లా మనం పీల్చే గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇప్పుడు పచ్చని నల్లమల అడవులపైనా మన కన్నుపడింది. యురేనియం కావాలంటే కొనుక్కోవచ్చు.. కానీ, అడవులను కొనగలమా?' అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. యురేనియాన్ని కొనలేకపోతే సౌరవిద్యుత్తు వంటివి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.