Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

42 ఏళ్లనాటి శంకరాభరణం సక్సెస్ మీట్, వేదిక మీద ఎవరెవరు వున్నారో చూడండి

Advertiesment
42 ఏళ్లనాటి శంకరాభరణం సక్సెస్ మీట్, వేదిక మీద ఎవరెవరు వున్నారో చూడండి
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (17:54 IST)
K. Vishwanath, SP Balasubrahmanyam, Edida Nageswararao, Akasham Sriramulu, madava peddi, Veturi, Rajyalakshmi,
కే.విశ్వనాధ్, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు, వేటూరి, రాజ్య‌ల‌క్ష్మి, మాధ‌వ‌పెద్ది అంతా క‌లిసి ఒకే వేదిక‌పై వున్నారు. నేటికి 42 ఏళ్ళ‌యింది. ఇది శంకరాభరణం విజ‌యోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన ఓ అనుభూతి. ఈ సంద‌ర్భంగా ఆ సినిమా గురించి తెలుసుకుందాం.

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం,”శంకరాభరణం”. చిత్రం విడుదలయ్యి నేటికి 42 సంవత్సరాలు పూర్తయ్యింది. ఫిబ్రవరి 2, 1980వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విడుదలయ్యింది. కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శకత్వంలో, పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ చిత్రం ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక & కేరళ ల్లో కూడా అఖండ విజయం సాధించింది.


అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్టమొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలయ్యి, తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఈ చిత్రం. ఆ రోజుల్లో ఎవరి నోట విన్నా శంకరాభరణం గురించే ప్రస్తావన. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో, ఈ చిత్రం విడుదల తరువాత ఎంతోమంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు. ప్రతి తెలుగువాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.

 
ఇక అవార్డుల విషయానికి వస్తే, జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు శ్రీ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపధ్య గాయకునిగా తొలిసారి జాతీయ అవార్డు, శ్రీమతి వాణిజయరాంకు ఉత్తమ గాయకురాలుగా, శ్రీ కే.వి.మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు అందుకున్నారు.


Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ( ఫ్రాన్స్)లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్నది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు 8 గెలుచుకుంది. ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి. శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారు శంకరాభరణం చిత్రంపై మూడు రోజులు ప్రవచనాలు కార్యక్రమం చేసారు, అలా ఓ చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే మెదటిసారి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. జె.వి. సోమయాజులు గార్ని అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు. అలాగే వాంప్ పాత్రలు ఎక్కువగా చేసే మంజుభార్గవి చాలా పవిత్రమైమ తులసి పాత్రలో లీనమైపోయింది.


ప్రముఖ హాస్య నటులు శ్రీ అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర పాటలు ఇప్పటికీ భాషతో సంబంధం లేకుండా అందరూ పాడుతూనే ఉంటారు. ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై & హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు . 42 ఏళ్ళు గడిచినా, ఇంకా ఈ చిత్రం ఏదో మాధ్యమంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌న అసిస్టెంట్ల‌ను దూరం పెట్టిన రాఘ‌వేంద్ర‌రావు