నాగార్జున క్లాసిక్ మూవీ 'శివ'కు 30 యేళ్లు

ఆదివారం, 6 అక్టోబరు 2019 (15:05 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన చిత్రం శివ. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి మూడు దశాబ్దాలు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ఒర‌వ‌డిని సృష్టించింది. శివ సినిమాకి ముందు శివ సినిమా త‌ర్వాత అని చెప్పుకునేలా ఆ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. 
 
ఈ చిత్రంలో నాగార్జున‌, అమల ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ క్లాసిక్ చిత్రాన్ని ఇప్ప‌టి ద‌ర్శ‌కులు కూడా ఆద‌ర్శంగా తీసుకుంటార‌నేది వాస్త‌వం. అప్ప‌ట్లో ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ లాగ‌డం అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. 
 
విమ‌ర్శ‌కులు సైతం ఈ సినిమాని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోయారు. అక్టోబ‌ర్ 5,1989న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 30 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా వ‌ర్మ శివ సినిమా పోస్ట‌ర్‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ నాగార్జునా.. నేడు మ‌న ప్రియ‌మైన బిడ్డ 30వ బ‌ర్త్‌డే అని కామెంట్ పెట్టాడు. 
 
శివ సినిమా త‌ర్వాత నాగార్జున‌- వ‌ర్మ 1992లో వ‌చ్చిన "అంతం" సినిమా కోసం క‌లిసి ప‌ని చేశారు. ఇక 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత 'ఆఫీస‌ర్' అనే సినిమా చేశారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'శభాష్‌ రా చిరంజీవి' అనేవారు... : మెగాస్టార్