సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మరిచిపోలేని సినిమాల్లో మహర్షి ఒకటి. ఈ సినిమా మహేష్ బాబు 25వ చిత్రం. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ మూవీకి మహేష్ బాబుకి కమర్షియల్ సక్సెస్ అందించడంతో పాటు మంచి పేరు కూడా తీసుకువచ్చింది. దీంతో వంశీ పైడిపల్లితో మహేష్ మరో సినిమా చేయాలనుకున్నారు.
కథ రెడీ చేసుకో మళ్లీ కలిసి సినిమా చేద్దాం అన్నారు మహేష్. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా ఎనౌన్స్ చేస్తారనుకున్నారు. అయితే... వంశీ చెప్పిన కథ నచ్చకపోవడంతో మహేష్ పరశురామ్‌తో సినిమాని ఎనౌన్స్ చేసాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుకున్నారు.
ఇటీవల చరణ్‌కి కథ చెప్పారు కానీ... అక్కడ కూడా స్టోరీ సరిగా లేకపోవడం వలన ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దీంతో వంశీ పైడిపల్లి మళ్లీ మహేష్ చెంతకే వెళ్లారట. మళ్లీ మహేష్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారట. అయితే... ఈసారి చేసేది సినిమా కాదు. వెబ్ సిరీస్ అని సమాచారం. అది కూడా మహేష్ బాబుతో కాదండోయ్ .. మహేష్ బ్యానర్లో వంశీ పైడిపల్లి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ వెబ్ సిరీస్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తాడట. మొత్తానికి మహర్షి అనే బ్లాక్‌బస్టర్ సాధించినా... వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఆఖరికి వంశీ పైడిపల్లి సినిమా ఎవరితో సెట్ అవుతుందో..?