బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి హీరోగా, సహ నటుడిగా పలు పాత్రలను పోషించిన మురళీ మోహన్ కొంతకాలం నటనకు దూరంగా వున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.పి.గా చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించిన ఆయనకు ఆదర్శం దివంగత శోభన్ బాబు. ఆయన బాటలో భూమిని నమ్ముకున్నానని చెప్పేవారు. అయితే ఆమధ్య మరలా వెండితెరపై నటించాలనుకుంటున్నాననీ మీడియా ముందుకు వచ్చారు.
కానీ ఆయనకు తెలుగు సినిమాలలో అస్సలు అవశాశాలే లభించలేదని తెలుస్తోంది. ఇటీవలే ఓ కన్నడ సినిమాలో నటించారు. అయినా నటుడిగా మరలా రీ ఎంట్రీ ఇస్తున్నానన్నా దర్శకులు పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. తాజాగా ఆయన నటుడిగా 50 సంవత్సరాలు సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకను సినిమారంగంలోని ప్రముఖులతో శుక్రవారంనాడు ఓ హోటల్ లో హైదరాబాద్ లో జరుపుకోనున్నారు. అక్కడ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు, ఆయన కుటుంబీకులు ఈ వయస్సులో నటనాపరంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నటనకు గుడ్ బై చెప్పమన్నారు అని తెలుస్తోంది. సమయపాలనకు పెట్టింది పేరైన మురళీమోహన్ గారు ఇప్పటి ట్రెండ్ కు తగినట్లుగా మారడం కష్టమైనపనేనని సన్నిహితులు చెప్పినట్లు సమాచారం.