అక్కినేని నాగ చైతన్య మజిలీ సినిమాతో సంచలన విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. దీంతో చైతు రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు చైతన్యతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే... ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో బంగార్రాజు సినిమా, దిల్ రాజు బ్యానర్లో నూతన దర్శకుడు శశితో ఓ సినిమా చేయాలి.
కానీ.. ఈ రెండు సినిమాల కంటే ముందుగా శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాని ఇంత అర్జెంట్‌గా ప్రకటించడం వెనక ఏం జరిగింది అనేది ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే... శేఖర్ కమ్ముల నూతన నటీనటులతో ఓ సినిమాని ప్రారంభించారు. ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. తీరా అవుట్‌పుట్ చూసుకుంటే.. అసలు సరిగా రాలేదట.
దీంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల అసంతృప్తితో అప్పటివరకు తీసింది అంతా పక్కన పెట్టేయాలి అనుకున్నాడట. నిర్మాతలకు చెబితే వాళ్లు కూడా ఓకే అన్నారట. అప్పుడు ఈ కథని ఎవరితో తీస్తే బాగుంటుందా అని ఆలోచిస్తే... చైతన్య అయితే బాగుంటాడు అనుకోవడం.. కాంటాక్ట్ చేయడం.. చైతన్య విన్న వెంటనే ఓకే చెప్పడం... డేట్స్ ఇవ్వడం... అలాగే సాయి పల్లవి కూడా ఓకే అనడం అంతా అలా అలా జరిగిందట. ఇది చైతు - శేఖర్ కమ్ముల సినిమా వెనకున్న అసలు కథ.