తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల నిలిచేందుకు ముందుకు వచ్చారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు తాను పోరాడతానని ఇటీవల ప్రకటించారు.
ఈ ప్రకటన మేరకు... మంగళవారం దీక్ష ప్రారంభించారు. ఇటీవల వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామంలో కొండల్ అనే యువకుడు ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల వనపర్తిలోనే ఈ ఉద్యోగదీక్ష చేపట్టారు. 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా, ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్షల్లో భాగంగానే ఆమె ఈ దీక్షలో పాల్గొంటున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షలో నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.